Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. కొండపల్లిలోని 29 స్థానాలకు మొన్న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ15, వైసీపీ14 స్థానాల్లో గెలుపొందింది. అయితే కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక రసాభాసగా సాగడంతో.. టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది.
  2. ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5గంటలకు సీఎస్‌ సమీర్‌శర్మ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ రోజు పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
  3. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు గత నెల చివరిలో ప్రారంభమయ్యాయి. అయితే నేడు 20వ రోజు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. అయితే ఒకరోజు ముందుగానే శీతాకాల సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.
  4. కర్నూలు జిల్లాలో నేడు సీఎం జగన్‌ పర్యటించనున్నారు. సీఎం జగన్‌ ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే ఈ నెల 23, 24, 25 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు.
  5. నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు ఈ ప్రో కబడ్డీ లీగ్‌ జరుగనుంది. అయితే ఈ సీజన్‌లో 12 జట్లు బరిలోకి దిగనున్నాయి. కరోనా దృష్ట్యా ప్రేక్షకులకు అనుమతిని నిర్వాహకులు నిరాకరించారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్‌ బెంగళూరు బుల్స్‌-యు ముంబాయి మధ్య జరుగనుంది. అలాగే తరువాతి మ్యాచ్‌ 8.30 గంటలు తెలుగు టైటాన్స్‌-తమిళ్‌ తలైవాస్ జట్టుల మధ్య పోరు జరుగనుంది. అనంతరం 9.30 గంటలకు బెంగాల్‌ వారియర్స్‌- యూపీ యోధ మధ్య మ్యాచ్‌ జరుగనుంది.
  6. నేడు నిర్మల్‌ జిల్లాలో వైఎస్‌ షర్మిల రైతు ఆవేదన యాత్ర నిర్వహించనున్నారు. దిలావర్‌పూర్‌, సారంగాపూర్‌, మామడ మండలాల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.
  7. నేడు ఆర్థికవేత్తలతో నిర్మలాసీతారామన్‌ వర్చుల్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రీ బడ్జెట్‌పై ఆర్థికశాఖ మంత్రి నిర్మాలసీతారామన్‌ సంప్రదింపులు జరుపనున్నారు.
  8. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,420లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 65,200లుగా ఉంది.

Exit mobile version