NTV Telugu Site icon

Vande Bharat Express: ఎద్దును ఢీకొట్టిన వందే భారత్.. రైలుకు మళ్లీ డ్యామేజ్!

Vande Bharat Train

Vande Bharat Train

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు తరుచూ చిన్న చిన్న ప్రమాదాలకు కేంద్రబిందువు అవుతోంది. ఇప్పటికే గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఈ రైలు ప్రమాదాల బారిన పడింది. తాజాగా తెలంగాణలోని ఖమ్మంలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్‌ వద్దకు రాగానే ట్రాక్‌పైకి వచ్చిన ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.కొన్ని నిమిషాల పాటు రైలును అక్కడే నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. మరమ్మతు పనులు పూర్తయిన తరువాత విశాఖపట్నానికి పంపిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బంది మరమ్మతులు చేయగా, 25 నిమిషాల ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది. షెడ్యూల్‌ ప్రకారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకోవాల్సి ఉంది.
Also Read:Pigs Death: ఏపీలో అంతుచిక్కని వ్యాధి.. వెయ్యికిపైగా పందులు మృతి!

కాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ గేదెలు, పశువుల మందను ఢికొట్టడం ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా వందేభారత్ రైలు ప్రమాదానికి గురయింది. గుజరాత్ లో పట్టాలపైకి వచ్చిన పశువుల మందను ఢీకొట్టింది. దీనితో ముందు రైలు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ముందుభాగం మొత్తం ఊడి చేతికొచ్చింది. ప్రతీసారి ట్రాక్ పైకి పశువుల మందలు రావడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Also Read:Revanth Reddy: నిజామాబాద్‌ జిల్లాలోకి రేవంత్ పాదయాత్ర.. పూర్తి రూట్ మ్యాప్ ఇదే !

తెలుగు రాష్ట్రాల మధ్య వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. ఇక ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది. ఈ రైలు ప్రతీ ఉదయం 5.45 గంటలకు వైజాగ్ స్టేషన్‌లో బయల్దేరి.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ స్టేషన్లలో ఆగుతుంది. రాజమండ్రిలో 2 నిమిషాలు, విజయవాడలో 5 నిమిషాలు, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఒక్కో నిమిషం ఈ ట్రైన్ హాల్ట్ అవుతుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.3,170గా ఉంది. అటు సికింద్రాబాద్ – విశాఖ చైర్ కార్‌ టికెట్‌ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.3,120గా నిర్ణయించారు.

Show comments