Site icon NTV Telugu

నేటి నుంచి బ్యాంకుల సమ్మె.. డిమాండ్స్‌ ఇవే..

బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాటపట్టారు.. ప్రభుత్వ రంగ బ్యాంకులు నేటి నుంచి రెండు రోజుల పాటు సమ్మెలో పాల్గొనబోతున్నాయి.. డిసెంబర్​ 16, 17 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈ సమ్మెలో పాల్గొని.. తమ డిమాండ్లను వినిపించబోతున్నాయి.. ఇంతకీ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన కారణాలు ఏంటి? వారి డిమాండ్లు ఏంటి? అని ఓసారి పరిశీలిస్తే.. ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్​ 2021-22లో కేంద్రం నిర్ణయించడం.. ఆ దిశగా ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో.. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి సంఘాలు. దీనిపై ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చాయి బ్యాంకు సంఘాలు.. యునైటెడ్​ ఫోరమ్​ ఆఫ్​ బ్యాంక్ యూనియన్​ (యూఎఫ్​బీయూ) సమ్మె నోటీసు ఇచ్చింది.. బ్యాంకులను ప్రైవేట్‌పరం చేస్తే బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్​లో పడతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, అదనపు చీఫ్​ కమిషనర్‌తో జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో.. సమ్మెకు దిగుతున్నారు.

Read Also: ‘ఊబెర్ ఈట్స్’ సరికొత్త రికార్డు.. అంతరిక్షంలో ఫుడ్‌ డెలివరీ..

నేడు, రేపు జరగనున్న ఈ సమ్మెలో ప్రభుత్వ రంగంలోని బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొనబోతున్నారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు నేతృత్వం వహిస్తోంది. బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు – 2021ని ఉపసంహరించుకోవాలని యుఎఫ్‌బీయూ డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని కోరుతోంది. ఈ దేశంలో సామాన్యులకు సేవలందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వుండడం చాలా అవసరమని పేర్కొంది. 1969లో బ్యాంకులను జాతీయకరణ చేసిన తర్వాతనే పేదలు, అవసరంలో వున్నవారికి బ్యాంకుల సేవలు అందాయన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తోంది.. 1969లో 8 వేలుగా వున్న ప్రభుత్వ రంగ శాఖలు ప్రస్తుతం 1.18 లక్షలకు చేరాయంటేనే ఎంతగా అభివృద్ధి చెందాయో తెలుస్తోందని.. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, నష్టాల్లో నడుస్తున్నాయని చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు.. బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సమ్మెకు ఇతర సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి.

Exit mobile version