విడుదల: సెప్టెంబర్ 10 సన్ టీవీ, సెప్టెంబర్ 11 నెట్ ఫ్లిక్స్
నిడివి: 146 మినిట్స్
నటీనటులు: విజయ్ సేతుపతి, పార్థిబన్, సత్యరాజ్, పెరుమాళ్, రాశీఖన్నా, మంజిమా మోహన్,
కరుణాకర్
నిర్మాత: యస్.యస్. లలిత్ కుమార్
కెమెరా: మనోజ్ పరమహంస, మహేంద్రన్ జయరాజు
సంగీతం: గోవింద్ వసంత
దర్శకత్వం: ఢిల్లీ ప్రసాద్ దీనదయాళన్
కోరోనా ఎఫెక్టెడ్ సినిమాలలో విజయ్ సేతుపతి నటించిన ‘తుగ్లక్ దర్బార్’ కూడా ఒకటి. విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ ’96’ సినిమాను పంపిణీ చేసిన లలిత్ కుమార్ ఆ సినిమా సక్సెస్ మీట్ లో విజయ్ సేతుపతితో డైరెక్ట్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. 2019లో ఆరంభమైన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో 2021లో పూర్తయింది. థియేటర్లు ఓపెన్ కాని కారణంగా ఈ సినిమాను డైరెక్ట్ గా సన్ టీవీలో వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ప్రదర్శించారు. ఇలా ఓ స్టార్ హీరో సినిమా డైరెక్ట్ గా శాటిలైట్ ద్వారా ప్రదర్శితమవటం ఇదే తొలిసారి. ఇక ఆ తర్వాతి రోజు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేశారు.
కథ విషయానికి వస్తే చిన్నపుడే తల్లితండ్రులను కోల్పోయిన సింగారవేలన్ (విజయ్ సేతుపతి)ని, అతని చెల్లెలు మణిమేకల (మంజిమామోహన్)ను కాలనీ వాసులే ఆదరించి పెంచుతారు. రాజకీయ ర్యాలీలో జన్మించిన సింగారవేలన్ కు ఆ పేరును స్థానిక రాజకీయవేత్త రాయప్పన్ (పార్థిబన్) పెడతాడు. పెరిగి పెద్దవాడైన సింగారవేలన్ తన తల్లి చావుకు కారణం చెల్లెలే అని భావించడంతో వారిద్దరి మధ్య దూరం పెరగుతుంది. ఇక తన ప్రాంతానికి కౌన్సిలర్ కావాలనుకున్న సింగారవేలన్ ఎత్తులు వేస్తూ మెల్లగా పార్టీ శ్రేణులను దాటుకుని రాయప్పన్ సన్నిహితుడుగా మారతాడు. అయితే అనుకోని ఓ ప్రమాదంతో సింగం తన మనసాక్షిని అనుసరిస్తూ నిజాయితీపరుడుగా ఉంటుంటాడు. మామూలు సమయంలో రాజకీయ ఆశయాలకు అనుగుణంగా నీతి, నియమాలు పక్కన పెట్టి రియల్ పొలిటీషియన్ లా వ్యవహరించే సింగం మనసాక్షి ఆవహించినపుడు మాత్రం మంచి చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. మరి తనలోని మంచి, చెడుల మధ్య సంఘర్షణకు గురయిన సింగారవేలన్ రాజకీయంగా అనుకున్నట్లు ఉన్నత స్థితికి చేరుకుంటాడా? నమ్మిన ప్రజలకు సేవ చేస్తాడా? అన్నది సినిమాలో చూడాల్సిందే.
విజయ్ సేతుపతి ఇటీవల కాలంలో తన సినిమాల ద్వారా అత్యుత్తమ నటనను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ‘మాస్టర్’లో విలన్ గా కనిపించిన విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’లోనూ పార్టీ సీటు కోసం ఏదైనా చేసే ఔత్సాహిక రాజకీయ నాయకుడిగా జీవించాడు. ఇక స్ల్పిట్ పర్సనాలిటీ ని ప్రదర్శించిన తీరు మెచ్చుకో తగింది. విజయ్ సేతుపతికి గురువుగా రాజకీయ వేత్తగా పార్థిబన్ కూడా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చాడు. ఒక్క సీన్ లో అయినా సత్యరాజ్ గుర్తుండి పోతాడు. విజయ్ కి చెల్లెలు మణిమేఖలగా నటించిన మంజిమా మోహన్ మాత్రం కొంచెం లావుగా కనిపించి నిరాశపరుస్తుంది. హీరోయిన్ కామాక్షిగా రాశీఖన్నా పాత్ర పాటలకే పరిమితం. విజయ్ స్నేహితుడు వాసుగా కరుణాకరన్ ఆకట్టుకుంటాడు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ గురించే. అవినీతిపరులైన రాజకీయ నాయకుల గురించి కామెడీ చేయకుండా సూటిగా చెప్పదలుచుకున్న పాయింట్ ని చెప్పాడు. హీరో రిలయ్ క్యారక్టెర్ కి, మనస్సాక్షితో కూడిన పాత్రకు మధ్య అంతర్గత యుద్ధం పెట్టి ఆసక్తి పెరిగేలా చేశాడు. క్లైమాక్స్‌లో హీరో, సత్యరాజ్ మధ్య సన్నివేశాలు సినిమాకి మంచి ఊపు తెస్తాయనటంలో సందేహం లేదు. మనోజ్ పరమహంస కెమెరా పనితనం, గోవింద్ వసంత నేపథ్య సంగీతం ఆద్యతం ఆకట్టుకుంటాయి. రెండు పాటలు సైతం అలరించేలా ఉన్నాయి. ఒక్క రోజు వ్వవధిలో విజయ్ సేతుపతి నటించిన రెండు సినిమాల విడుదల కావటం తమిళ ప్రేక్షకులకు ఆనందన్ని కలిగిస్తే… అందులో 9న విడుదలైన ‘లాభం’ నిరాశను మిగిల్చిన తరుణంలో తర్వాత వచ్చిన పొలిటికల్ సెటైర్ ‘తుగ్లక్ దర్బార్’ మాత్రం ఎంటర్ టైన్ చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
రేటింగ్: 3/5
ప్లస్ పాయింట్స్
విజయ్ సేతుపతి నటన
కథ, కథనం
ఆకట్టుకునే సంభాషణలు
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
సిస్టర్ సెంటిమెంట్
హీరోయిన్ ట్రాక్
థియేట్రికల్ రిలీజ్ లేకపోవడం
ట్యాగ్ లైన్
రాజకీయ వ్యంగ్య చిత్రం