Site icon NTV Telugu

అదనపు సిబ్బందిపై ఫోకస్.. సజ్జనార్ నయా స్ట్రాటజీ!

తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ వీసీ సజ్జనార్ నడుం బిగించారు. ఇప్పటికే సిబ్బందిలో జవాబుదారీ తనం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆర్టీసీ బాస్ ఇప్పుడు ఆదాయ వనరులు పెంచేందుకు, ఖర్చులు తగ్గించే పనిలో పడ్డారు. అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో అదనపు సిబ్బందిని తగ్గించాలని ఆయన నిర్ణయించారు. బస్ భవన్‌లో ఖర్చులు తగ్గించడం, అవసరం లేని సిబ్బందిని ఇతర విభాగాలకు కేటాయించడం చేయాలని నిర్ణయించారు.

అదనపు సిబ్బందిని గుర్తించాలని, ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులకు సూచించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీని ప్రజలకు దగ్గర చేసేందుకు, ఆక్యుపెన్సీ పెంచేందుకు తనవంతు ప్రయత్నాలు చేశారు. దసరా, ఇతర పండుగల సందర్భంగా ప్రయాణికులనుంచి 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయరాదని ఆదేశాలిచ్చారు.

అధికారులు తమ దగ్గర వున్న దస్త్రాలు, ఆర్థికాంశాలకు సంబంధించినవి వెంటనే పరిష్కరించాలని సూచించారు. అంతేకాదు ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీతాలు ఎప్పుడు వస్తాయనే పరిస్థితిని మార్చారు. ప్రతి నెలా ఒకటవ తారీఖున జీతాలు అందించే ఏర్పాట్లు చేశారు. కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్‌లో ప్రయాణించి ఆర్టీసీపై భరోసా కల్పించారు. సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులనుంచి సూచనలు, ఫిర్యాదులు స్వీకరించారు. అంతేకాకుండా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు బస్సులు బుక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్న వారికి పెళ్ళిళ్ళ సందర్భంగా బహుమతులు కూడా ఇచ్చే సంస్కృతిని తెచ్చారు.

బస్ భవన్‌లో ఏ పని కావాలన్నా నాలుగు దశల్లో జరుగుతోంది. ఈ విధానం మార్చి ఒకే గొడుగు కింద వివిధ కార్యకలాపాలు పూర్తిచేయాలని, అదనపు సిబ్బంది ఎంతమంది వున్నారనేది పరిశీలించి వారిని ఇతర విభాగాలకు పంపేలా ఏర్పాట్లుచేయనున్నారు. సూపర్ వైజర్ల వ్యవస్థను ప్రక్షాళించనున్నారు. కొత్తవ్యాపార విధానాలపై సజ్జనార్ ఫోకస్ పెట్టారు. కార్గో ద్వారా మంచి ఆదాయం లభిస్తోంది. అలాంటి తరహాలే ఆదాయ వనరుల్ని పెంపొందించుకోవాలని సజ్జనార్ యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ఆదాయం పెంచే పనిలో పడ్డారు ఎండీ సజ్జనార్.

Exit mobile version