నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రోజురోజు అత్యాధునిక సాంకేతికతతో ప్రంపచం ముందు వెళుతోంది. కానీ.. కొంతమంది యువత మాత్రం మత్తులో చిత్తవుతూ.. వారి జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏపీలో ఎక్కడ తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి బయటపడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు శాఖ బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లను నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో సైతం మాదకద్రవ్యాల వాడకం బయట పడుతూనే ఉంది. ఇటీవల మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
దీంతో ఈ పుట్టినరోజు పార్టీలో సుమారు 30 మంది యువతీయువకులు గంజాయి మత్తులో దొరికనట్లు తెలుస్తోంది. యువతకు సరైన గైడెన్స్‌లేక మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. తమ పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపడం వల్ల వారి ఆలవాట్లపై ఓ అంచనా వస్తుందని, ఎక్కువగా పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలని నిపుణులు సూచిస్తున్నారు. చదువు, ఇతరాత్ర విషయాల్లో ఒత్తిడికి లోనైనప్పుడే యువత చెడు మార్గాలు ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. ఆ సమయంలో తల్లిదండ్రులు మార్గదర్శులుగా ఉండాలని ఆధ్యాయనాలు చెబుతున్నాయి.
యువత గంజాయి, డ్రగ్స్ లాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించక తప్పదు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ స్మగ్లర్లు కూడా మాదకద్రవ్యాల రవాణాలో కొంత పంథాను ఎంచుకుంటున్నారు. అసాంఘీక కార్యకలాపాలు కనబడినా, ఎవరిపైనా అనుమానం వచ్చిన సమాచారం అందిచాలని పోలీసులు సూచిస్తున్నారు.