Site icon NTV Telugu

ఆలయాల నిర్మాణానికి రూ.44.98 కోట్లు

తెలంగాణలో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వీక‌ర్ సెక్షన్ కాల‌నీలలో ఆల‌యాల నిర్మాణానికి రూ. 7.56 కోట్లు కేటాయించామన్నారు. దీనికి సీజీఎఫ్ క‌మిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీయం కేసీఆర్ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంద‌ని దేవాదాయ వాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

గురువారం అర‌ణ్య భ‌వ‌న్ లో కామ‌న్ గుడ్ ఫండ్ క‌మిటీ స‌భ్యుల‌తో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. సర్వశ్రేయో నిధి (కామన్‌ గుడ్‌ ఫండ్‌–సీజీఎఫ్‌) ద్వారా చేపట్టిన ప‌నుల పురోగ‌తిపై మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలోని చిన్న చిన్న ఆలయాల నిర్వహణ, పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూత‌న ఆల‌యాల నిర్మాణం వేద పాఠశాలల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం సీజీఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నామ‌ని, సీజీఎఫ్‌ ద్వారా చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… 130 నూతన ఆలయాల నిర్మాణానికి రూ.44,98 కోట్లు, వీక‌ర్ సెక్ష‌న్ కాల‌నీల్లో 63 ఆల‌యాల నిర్మాణానికి రూ. 7. 56 కోట్ల నిధుల మంజూరుకు సీజీఎఫ్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. షాద్ న‌గ‌ర్ లోని వేదపాఠశాల నిర్వహణకు రూ. 5.43 ల‌క్షలు కేటాయించేందుకు క‌మిటీ అంగీక‌రించ‌ద‌ని తెలిపారు.

యాదాద్రి ఆల‌య పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలని మంత్రి ఇంద్రకర‌ణ్ రెడ్డి ఆదేశించారు. మ‌హా సుద‌ర్శన యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ జరుగుతుందన్నారు. ఎన్ఆర్ఐల నుంచి విరాళాల సేక‌ర‌ణ‌కు ప్రత్యేక యాప్ రూపొందించామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

Exit mobile version