రాయలసీమ ఎత్తిపోతల పేరిట పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలని ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ తీవ్ర విమర్శలకు గురవుతున్నది. దీనిపై కృష్ణాజలాల సంఘానికి లేఖ రాయగా.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలిచ్చారు. అయితే, గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్‌లతో కేంద్ర నీటిపారుదల మంత్రి గజేంద్ర షెకావత్ జరిపిన తొలిసమావేశంలోనే ఇరు రాష్ట్రాల అనధికార ప్రాజెక్టులను నిలిపేయాలని పూర్తి వివరాలుండే డిపిఆర్‌లు సమర్పించి ఆమోదం పొందిన తర్వాతనే ముందుకు సాగాలని నిర్ణయించారు. అయితే భారత దేశంలో ఇంతవరకూ రాష్ట్రాలుముందే పూర్తి ఆమోదం వచ్చేవరకు ఆగివుంటే ఏ ప్రాజెక్టులుపూర్తయివుండేవి కావని అందరికీ తెలుసు. ఏదో రూపంలో కడుతూ అనుమతులకోసం పెనుగులాడుతూ వివాదాలు చేసుకుంటూనే వాటిని కొనసాగిస్తుంటాయనేది బహిరంగ రహస్యం. రాజోలిబండ డైవర్షన్ వంటివాటిపై నిరంతరం ఘర్షణలు వుంటూనే వున్నాయి కనుక ఇవి హఠాత్తుగా వచ్చినట్టు ఎవరు ప్రవర్తించినా అవాస్తవికతే అవుతుంది. కృష్ణా జలాలపై బ్రిజజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఇచ్చిన అవార్డుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. నదీజలాలను మొత్తం అన్ని రాష్ట్రాల మధ్యన మళ్లీ పంచాలని కేవలం విడిపోయిన తెలుగు రాష్ట్రాలకే కాదనివాదించింది. పైన చెప్పిన సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చినపుడు సుప్రీం కోర్టులో వారి కేసు ఉపసంహరించుకుంటే తాము జోక్యం చేసుకోగలమని కేంద్రమంత్రి షెకావత్ చెప్పారు. ఆ తర్వాత ఆలస్యంగా ఈ మధ్యనే కేసు ఉపసంహరించుకున్నారు. అయితే నదీజలాలను మొత్తంగా గాక ప్రాజెక్టుల వారిగా పంచాలని తెలంగాణ చేస్తున్న వాదనపై న్యాయ సలహాతీసుకోవాలని కేంద్రం భావిస్తునన్నట్టు చెబుతున్నారు. అప్పటి వరకూ గత పంపిణీ కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ చెబుతుంటే స్టే వుందని తెలంగాణ అంటుంది.
శ్రీశైలంలో తముకు కేటాయించిన నీటిని వరద సమయంలో వేగంగా తీసుకోవడానికి మాత్రమే పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ సామర్థ్యం పెంచుతున్నాము తప్ప అదనంగా తీసుకోవడానికి కాదని ఎపి వాదన కాగా.. బాగా తక్కువ మట్టం వున్నప్పుడు కూడా ఎక్కువ నీరుతీసుకోవడానికి ఈ పెంపుదల అని తెలంగాణ ఆరోపణగావుంది. వాస్తవంగా శ్రీశైలం దిగువన తెలంగాణ ఎక్కువ నీరు తీసుకుంటూ వుందని నీరులేనప్పుడు కూడా జలవిద్యుత్ చేస్తుందని ఎపి అంటోంది. పట్టిసీమ ఎత్తిపోతలతో సహా ఏపీ ప్రాజెక్టులకు అనుమతిలేదని తెలంగాణ అంటే డిండి పాలమూరు తదితర పథకాలకు కాళేశ్వరానికి కూడా పూర్తి అనుమతి లేదని ఏపీ వాదిస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఉభయుుులూ అంగీకరించినవి దాదాపు లేనట్టే చెప్పొచ్చు. ఒక అవగాహన వున్నచోట్ల కూడా ఎవరు ఎక్కువ నీరు తీసుకున్నారనేది నిరంతర వివాదమే. అందువల్ల ఇప్పుడే ఏదో కొత్తగా వచ్చినట్టు ఎవరు మాట్లాడినా పొరబాట. రెండు రాష్ట్రాలలో తమ రాజకీయ అవసరాల నిమిత్తం గొంతు పెంచుతుంటారని ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. చంద్రబాబు హయాంలో అంతంతమాత్రంగా వున్న ఇరు రాష్ట్రాల సంబంధాలు జగన్ వచ్చాక బాగా మెరుగయ్యాయని టిఆర్‌ఎస్ వర్గాలు చెబుతుండేవి. నదీజలాలపై కూడా ఇరువురు కలసి చర్చించి ఒక అవగాహన ప్రకటించిన సందర్భం వుంది. మరి ఇప్పుడు ఒక్కసారిగా అదంతా మారిపోతుందా? ఇక బిజెపి, కాంగ్రెస్ వంటి ప్రధానపార్టీలు రెండు రాష్ట్రాలలో రెండు రకాలుగా రెచ్చగొట్టడం పాతరోజులను గుర్తుచేస్తుంది. తెలంగాణ ముంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. వైఎస్‌రాజశేఖరరెడ్డి దొంగ అయితే.. జగన్ గజదొంగ అని అంటారు. దానిపై ఎంఎల్‌ఎ రోజా వంటివారు ప్రతివిమర్శ చేస్తే వేముల సర్దుకున్నట్టు మాట్లాడుతూనే తాను ప్రజలను అనలేదని వైఎస్ మాత్రం తెలంగాణ ప్రజలకు రాక్షసుడేనని ఆరోపించారు. మరో ముంత్రి శ్రీనివాసగౌడ్ నరరూపరాక్షసుడని జోడించారు. ఇలా అన్నందుకు నాలుక కోయాలని సిపిఐ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఈటెల రాజేందర్ పరిణామం తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగాననే తీవ్ర భాష వాడుతున్నదని పరిశీలకులుభావిస్తున్నారు. కెసిఆర్‌తో సత్సంబంధాలు వున్న జగన్ ఎందుకు ఇప్పుడు మౌనం దాల్చారని టిడిపి, కాంగ్రెస్, బిజెపిలు అక్కడ మాట్లాడుతున్నాయి. ఎన్‌జిటి, కెఆర్‌ఎంబిల పేరిట నోటీసులువస్తున్నాయి. కానీ, వివాదాన్ని పరిష్కరించవలసిన కేంద్రం.. కెఆర్‌ఎంబి తగినంత చొరవ చూపడం లేదు. ఎపి, తెలంగాణల విభజన సమస్యలు అత్యధికంగా అపరిష్క్రతంగా వుంచడం కేంద్రం వ్యూహంగా మారింది. ఈ సమయంలో సంయమనంతో సంప్రదింపుల ద్వారా రాజ్యాంగ బద్దంగా పరిష్కరించుకోవడంతప్ప మరో మార్గం లేదు. కేంద్రంలోని బిజెపి ఇరు రాష్ట్రాలలో ప్రధాన పార్టీలు రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల వివాదాలను వాడుకోవడం పొరబాటు, హానికరం కూడా.