Site icon NTV Telugu

60 ఏళ్ళ ‘టాక్సీ రాముడు’

విశేషమైన ప్రజాదరణ ఉన్న నటులు విషాదాంత కథాచిత్రాల్లో నటిస్తే, అవి జనాన్ని అంతగా ఆకట్టుకోలేవని అంటారు. అలాంటి ఉదాహరణలు చిత్రసీమలో కోకొల్లలు. కానీ, కొన్నిసార్లు కథ కట్టిపడేసినప్పుడు హీరో చివరలో చనిపోయినా, సదరు చిత్రాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించిన దాఖలాలూ ఉన్నాయి. నటరత్న యన్టీ రామారావు కెరీర్ లో ఇలాంటి రెండు పరిస్థితులూ నెలకొన్నాయి. అరవై ఏళ్ళ క్రితం యన్టీఆర్ నటించిన ‘టాక్సీ రాముడు’లో హీరో తన ప్రేయసి కాపురం నిలపడం కోసం ప్రాణాలు తెగించి పోరాడి, కన్నుమూస్తాడు. 1961 అక్టోబర్ 18న విడుదలైన ‘టాక్సీ రాముడు’ అప్పట్లో జనాన్ని కంటనీరు పెట్టించింది.

నిజానికి మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న యన్టీఆర్ ‘రాముడు’ అన్న టైటిల్ తో వచ్చిన చిత్రాలను చూస్తే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. పైగా కథ సుఖాంతంగానే ఉంటుంది. ‘టాక్సీ రాముడు’ టైటిల్ చూస్తే ఫక్తు మాస్ అనిపిస్తుంది. కానీ, ఇందులోని కథ వేరుగా సాగుతుంది. అసలు కథ విషయానికి వస్తే – రాము, అతని చిన్ననాటి నేస్తం సరోజ ప్రేమించుకుంటారు. రాము టాక్సీ నడుపుతుంటాడు. సరోజ, ఆమె తండ్రి పనిచేసే ఆఫీసులోనే స్టెనోగా ఉంటుంది. ఆ యజమాని తనయుడు మోహన్ తిరుగుబోతు. అతణ్ణి దారిలో పెట్టడానికి సరోజనిచ్చి పెళ్ళి చేయమని ఆమె తండ్రిని యజమాని కోరతాడు. సరోజ తిరస్కరిస్తుంది. సరోజ తండ్రి ఆఫీసులో పదివేల రూపాయలు పోగొట్టాడని అభియోగం వస్తుంది. దాని నుండి తన తండ్రిని కాపాడమని సరోజ, యజమానిని వేడుకుంటుంది. ఈ విషయం తెలిసి రాము పదివేలు సంపాదించే ప్రయత్నంలో ఉంటాడు. కానీ, అతను ఎంతకూ రాకపోయే సరికి తప్పని సరి పరిస్థితుల్లో సరోజ, మోహన్ ను పెళ్ళాడుతుంది. ఓ బిడ్డ పుట్టినా, భార్యను అనుమానిస్తూ ఉంటాడు. దాంతో మోహన్ తండ్రి ఆస్తి మొత్తం పుట్టిన బిడ్డ పేర రాసి, కన్నుమూస్తాడు. కానీ, ఆ ఆస్తిలో తనకు చిల్లిగవ్వా వద్దని మోహన్ కే తిరిగి ఇస్తుంది సరోజ. భార్య మంచి తనం చూసి మోహన్ మారిపోతాడు. మోహన్ పాత మిత్రుడు నాగు, అతణ్ణి బ్లాక్ మెయిల్ చేస్తాడు. డబ్బు ఇవ్వనని మోహన్ తెగేసి చెప్పడంతో చంపడానికి టైమ్ బాంబు ఏర్పాటు చేస్తాడు. అదే సమయంలో రాము కూడా మోహన్ పై పగబట్టి చంపజూస్తాడు. కానీ, సరోజ గుర్తుకు వచ్చి ఆ ప్రయత్నం విరమించుకుంటాడు. ఈ సమయంలో టైమ్ బాంబు నుండి మోహన్ ను కాపాడబోయి రాము కళ్ళు పోగొట్టుకుంటాడు. అతణ్ణి మోహన్ తన ఇంటికి తీసుకు వస్తాడు. సరోజ సేవలు చేస్తుంది. మోహన్ పాత స్నేహితురాలిని నాగు చంపేసి, ఆ నేరం మోహన్ పై మోపుతాడు. మోహన్ జైలు పాలవుతాడు. మోహన్ స్నేహితురాలు చనిపోతూ, నాగు తనను బెదిరిస్తున్నాడన్న లెటర్ రాసి ఉంటుంది. దానిని సరోజ సంపాదిస్తుంది. అయితే ఆమె నుండి ఆ లేఖను నాగు బలవంతంగా తీసుకుంటాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో రాము ఆవేశంలో కళ్ళకు కట్టిన కట్టు విప్పుకుంటాడు. చీకటి అయిపోతుంది. అయినా నాగును హతమార్చి, సరోజను కాపాడతాడు. చివరకు ఆ లేఖ ద్వారా మోహన్ నిర్దోషి అని తేలుతుంది. ఆ సంతోషంతో రాము కన్నుమూస్తాడు.

రాముగా యన్టీఆర్, మోహన్ గా జగ్గయ్య, సరోజగా దేవిక, నాగుగా రాజనాల నటించారు. మిగిలిన పాత్రల్లో రేలంగి, గుమ్మడి, చదలవాడ, కేవీయస్ శర్మ, గిరిజ, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, రాగిణి నటించారు. ఈ చిత్రానికి టి.వి.రాజు సంగీతం సమకూర్చగా, సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, మల్లాది రామకృష్ణశాస్త్రి, ఆరుద్ర, కొసరాజు పాటలు రాశారు. ఈ చిత్రానికి కథను సముద్రాల జూనియర్ సమకూర్చారు. ఇందులోని “వన్నెల చిన్నెల…”, “రావోయి మనసైన రాజా…”, “గోపాలబాలా కాపాడవా…”, “మావయ్య తిరునాళ్ళకు…” వంటి పాటలు అలరించాయి.

వి.మధుసూదనరావు దర్శకత్వంలో డి.వి.కె.రాజు, కె.ఎన్.రాజు, కె.రామచంద్రరాజు, సి.యస్.రాజు నిర్మించారు. శ్రీరామకృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. ‘టాక్సీ రాముడు’లో యన్టీఆర్, దేవిక జంటగా నటించినా, వారి ప్రేమకథ సుఖాంతం కాకపోవడంతో అభిమానులకు ఈ చిత్రం అంతగా నచ్చలేదు. అయితే మహిళాప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా సాగింది. రిపీట్ రన్స్ లో భలేగా ఆకట్టుకుంది.

Exit mobile version