గవర్నమెంట్ ఆఫీసర్ అంటే వాళ్లకు ఎన్ని సదుపాయాలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అందులోనూ మంచి క్యాడర్ ఉన్న అధికారులకు కారులో వెళ్లే సౌకర్యాలు కూడా ఉంటాయి. అయితే తమిళనాడులో ఓ కలెక్టర్ మాత్రం చాలా సింప్లిసిటీతో ఉంటున్నారు. వారంలో ఒకరోజు ఇంటి దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు నడిచి కార్యాలయానికి వెళ్తున్నారు. అయితే ఆమె నిర్ణయం వెనుక ఓ మంచి ఉద్దేశం ఉంది.
వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన రమణ సరస్వతి కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆతర్వాత ఐఏఎస్ చదివి తమిళనాడు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. మొదటగా వేలూరు డివిజన్‌లో రెవెన్యూ డివిజనల్ అధికారిగా విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత తిరునెల్వేలి జిల్లాకు రెవెన్యూ అధికారిగా బదిలీ అయ్యారు. 2012 నుంచి 2017 వరకు జిల్లా జాయింట్ కమిషనర్, సివిల్ సప్లై, ఈపీడీస్ PDS అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2017- 2021 మధ్య కాలంలో జిల్లా జేడీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్‌లోనే అరియలూరు జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు.
Read Also: పక్కింటి అమ్మాయికి అందాల కిరీటం
కలెక్టర్ హోదాలో ఉన్న రమణ సరస్వతి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ప్రస్తుతం కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తన వంతుగా ఏదైనా చేయాలని భావించారు. దీంతో వారంలో ఒకరోజు ఆఫీస్‌కు నడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. వాహనాల వాడకాన్ని తగ్గిస్తే కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చని భావించిన ఆమె.. తన ఇంటి నుంచి ఆఫీస్ వరకు సుమారు 2 కిలోమీటర్లు నడుస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రజలు కూడా కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల వాడకాన్ని తగ్గిస్తే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయపడుతున్నారు.
