Site icon NTV Telugu

వర్షంలో తడుస్తూ.. నీళ్ళలో నడుస్తూ స్టాలిన్ పర్యటన

భారీ వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు సీఎం. చెన్నై సిటీలోని పలు ప్రాంతాలతో పాటు సబర్బన్ ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఎలక్ట్రిసిటీ లోకల్ ట్రైన్స్ రద్దు చేసింది రైల్వే శాఖ. చెన్నై సిటీకి తాగునీటిని అందిస్తున్న చెంబరబాక్కం, పుజల్ రిజర్వాయర్ గేట్లు తెరిచారు. వరద ప్రవాహం పెరగడంతో పుజల్ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో నీరు పరవళ్ళు తొక్కుతోంది.

దీంతో సిటీలో ‘ఫ్లడ్ అలర్ట్’ను అధికారులు ఆదివారంనాడు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్లకు స్టేట్ వాటర్ రిసోర్సెస్ అధారిటీ సూచించింది. శనివారం ఉదయం నుంచి చెన్నై, కాంచీపురంలోని పలు సబర్బన్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో చాలా ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

2015 నుంచి ఇంత భారీ వర్షాలు సిటీలో చూడలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 10 వరకూ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎన్నడూ లేని విధంగా చెన్నైని భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు రాయపురంలో ఇల్లు కూలి ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 20 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.

Exit mobile version