తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. అనుకున్నదే అయ్యింది. తాలిబన్ల రాక్షసత్వం బయటపడింది. ప్రపంచం ముందు మహిళలకు గౌరవం ఇస్తామని చెబుతున్న తాలిబన్లు.. క్షేత్రస్థాయిలో తమ రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. రాతియుగం నాటి షరియత్ చట్టాలను ఆప్ఘన్ ప్రజల మీద రుద్దడం మొదలు పెట్టారు. మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థల్లో కో- ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ తొలి ఫత్వాను జారీ చేశారు. సమాజంలో దుర్మార్గాలకు ఆడ-మగా కలిసి చదువుకోవడమే కాణమంటున్నారు తాలిబన్లు. అందుకే ఆ విధానాన్ని నిషేధిస్తున్నామని చెప్పుకొచ్చారు. హెరాత్ ప్రావిన్స్‌లోపని యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేటు విద్యసంస్థల యజమానులతో దాదాపు మూడు గంటలపాటు చర్చించిన తాలిబన్లు, ఈ నిర్ణయం తీసుకున్నారు. కో ఎడ్యుకేషన్‌ను నిలిపేయడతో పాటు, మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించాలని, పురుషులకు బోధించేందుకు అనుమతి లేదని తెలిపారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం హెరాత్ ప్రావిన్స్‌లో దాదాపు 40 వేల మంది విద్యార్థులు, రెండు వేల మంది లెక్చరర్లు ఉన్నారు. 2001లో తాలిబన్ల పాలన తొలిసారి అంతమైన తర్వాత ఆప్ఘన్‌లో మహిళలకు స్వేచ్ఛ లభించింది. విద్యా, ఉద్యోగాల్లో పురుషులకు సరిసమానంగా హక్కులు దక్కాయి. విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లలో కో-ఎడ్యుకేషన్ అమలులోకి వచ్చింది. ఆప్ఘన్ మళ్లీ తాలిబన్ల చేతికి రావడంతో ఇప్పుడా వ్యవస్థకు సమాధి కట్టాల్సి వస్తోంది. తాలిబన్లు జారీ చేసిన ఈ తొలి ఫత్వాతో భవిష్యత్తులో ఆప్ఘన్ మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారో స్పష్టమవుతోంది. బయటకి మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తామంటున్న తాలిబన్లు.. లోపల మాత్రం తమ రాక్షసత్వానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.
