ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ల పాలకుల మరో కోణం బయటపడింది. అక్కడ పాలన సాగిస్తున్న తాలిబన్లు మహిళలపై తాజాగా మరో హుకుం చేశారు. దూర ప్రయాణాలు చేసే మహిళలు ఖచ్చితంగా పురుషుడి తోడు తీసుకోవాలని ఆదేశించారు. దూర ప్రాంతాలకు వెళ్లే మహిళల వెంట కచ్చితంగా పురుషులు ఉండాల్సిందేనని, పురుషులు లేకుండా వచ్చే మహిళలకు రవాణా సౌకర్యం కల్పించవద్దని తాలిబన్ సర్కారు స్పష్టం చేసింది. 45 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలంటే వారితో పాటు కచ్చితంగా పురుషుడు వెంట రావాల్సిందేనన్నది ఆ హుకుంలో వుంది.
ఈ ప్రకటనపై ఆఫ్ఘనిస్థాన్ లోని మావనహక్కుల కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘన్ లో మహిళలపై అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తాజా ప్రకటనతో తాలిబన్ల విశ్వసనీయతపై మరోమారు సందేహాలు బయల్దేరాయి. తాము అందరికీ హక్కులు కల్పిస్తున్నామని తాలిబన్లు చెబుతున్నా.. ఆంక్షలు విధిస్తూ తమ రీతిని చాటుకుంటున్నారు.
