Site icon NTV Telugu

చెప్పింది ఒకటి.. చేసేది మరోటి.. తాలిబన్ల డోర్ టు డోర్‌ త‌నిఖీలు..!

తాలిబన్లపై ఆది నుంచి అనుమానాలే.. వారు చెప్పేది ఒకటైతే.. చేసేది మరోలా ఉంటుందనే వాదన ఇప్పటిది కాదు.. ఇప్పుడు అదే జరుగుతోంది.. ఆఫ్ఘన్‌నిస్థాన్‌ ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన తాలిబన్ల ప్రతినిధులు.. ఇక యుద్ధం ముగిసిందని.. అందరనీ క్షమించేశాం.. ఇస్లాం చట్టాల ప్రకారం.. మహిళలకు కూడా రక్షణ కల్పిస్తాం వంటి.. మంచి మంచి మాటలు చెప్పుకొచ్చారు.. ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చి రెండు రోజులు గడిచిందో లేదు.. అప్పడే.. డోర్‌డోర్ తనిఖీలు చేపట్టారు తాలిబన్లు… గ‌తంలో నాటో ద‌ళాల‌కు ప‌నిచేసిన వారి కోసం గాలింపు చేప‌డుతున్నారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌ను తాలిబ‌న్లు బెరిస్తున్నట్లు యూఎన్ చెబుతోంది.. ఎటువంటి ప్రతీకారం తీర్చుకోమ‌ని తాలిబ‌న్లు చెప్పినా.. ప్రస్తుతం ఆ మిలిటెంట్లు మాన‌వ‌వేట కొన‌సాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.. వ్యక్తిగ‌తంగా కొందరినీ తాలిబన్లు టార్గెట్ చేశారని.. ఆ బెదిరింపులు దానిని స్పష్టం చేస్తున్నాయని రిప్టో నార్వేయ‌న్ సెంట‌ర్ త‌న నివేదిక‌లో పేర్కొంది..

ఇక, అమెరికా బ‌ల‌గాలు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న స‌మ‌యంలో.. నాటో ద‌ళాలు కూడా తాలిబ‌న్ల అరాచ‌కాల‌ను నిలువ‌రించాయి. ప్రస్తుతం నాటో దళాలు ఆ దేశం నుంచి వెళ్లిపోయిన నేప‌థ్యంలో వారికి స‌హ‌క‌రించిన వారి కోసం తాలిబ‌న్లు అన్వేషిస్తున్నారు. వాళ్లకు వాళ్లుగా లొంగిపోతే ఏమీ చేయ‌మ‌ని, లేదంటే వాళ్లను ప‌ట్టుకుని విచారించి, వారి కుటుంస‌భ్యుల‌ను శిక్షిస్తామ‌ని తాలిబన్లు హెచ్చరిస్తున్నట్టు యూఎన్ త‌న రిపోర్ట్‌లో పేర్కొంది. మరోవైపు.. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్‌లో నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version