హిందీ చిత్రసీమకు త్రిమూర్తులుగా వెలిగారు దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్. వారి తరువాతి తరం హీరోల్లో మేచో మేన్ గా జేజేలు అందుకున్నారు ధర్మేంద్ర. ఆయన నటవారసుడుగా సన్నీ డియోల్ సైతం విజయపథంలో పయనించారు. సన్నీ డియోల్ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. 2019లో గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి బీజేపీ టిక్కెట్ పై ఎంపీగా గెలుపొందారు.
ధర్మేంద్ర, ఆయన మొదటి భార్య ప్రకాశ్ కౌర్ తొలి సంతానంగా 1956 అక్టోబర్ 19న సన్నీ డియోల్ జన్మించారు. ఆ రోజుల్లో ధర్మేంద్ర టాప్ హీరోగా సాగారు. చిన్నప్పటి నుంచీ తండ్రిని చూస్తూ పెరిగిన సన్నీ డియోల్ కు సైతం సినిమాల్లో నటించాలన్న అభిలాష సహజంగానే కలిగింది. దాంతో 1983లో ‘బేతాబ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు సన్నీ. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో కృష్ణ తనయుడు రమేశ్ హీరోగా ‘సామ్రాట్’ పేరుతో రూపొందింది. సన్నీ నటించిన ‘అర్జున్’ సైతం విజయకేతనం ఎగురవేసింది. ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘భారతంలో అర్జునుడు’గా తెరకెక్కింది. తండ్రి ధర్మేంద్రతో కలసి ‘సుల్తానత్’లో నటించారు సన్నీ. “యతీమ్, త్రిదేవ్, చాల్ బాజ్, నిగాహే, క్రోధ్” వంటి చిత్రాలలో అలరించారు సన్నీ. ఆ తరువాత తమ సొంత చిత్రం ‘ఘాయల్’తో అదిరిపోయే హిట్ పట్టేశారు. “నరసింహా, విశ్వాత్మ, దామినీ, డర్, అంగరక్షక్, జిద్దీ, బోర్డర్” చిత్రాలలోనూ సన్నీ నటన ఆకట్టుకుంది. ‘దిల్లగీ’ సినిమాతో డైరెక్టర్ గానూ మారారు. ఇందులో తన తమ్ముడు బాబీ డియోల్ తో కలసి నటించారు. 2001లో విడుదలైన ‘గదర్ -ఏక్ ప్రేమ్ కథ’ ఆ యేడాది టాప్ గ్రాసర్ గా నిలచింది. ఈ బంపర్ హిట్ తరువాత మళ్ళీ సన్నీ డియోల్ కు ఆ స్థాయి సక్సెస్ లభించలేదు. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘గదర్ – ఏక్ ప్రేమ కథ -2’ తెరకెక్కనుందని ఇటీవల సన్నీ డియోల్ తెలిపారు.
సన్నీ డియోల్ 1984లో పూజా డియోల్ ను పెళ్ళాడారు. ఆమెను లిండా డియోల్ అనీ పిలుస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులు – కరణ్, రాజ్ వీర్. ‘యమ్లా పగ్లా దీవానా-2’ చిత్రంలో తండ్రి ధర్మేంద్ర, తమ్ముడు బాబీ డియోల్ తో కలసి నటించారు సన్నీ. ఈ చిత్రానికి ఆయన తనయుడు కరణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. మరి రాబోయే ‘గదర్’ సీక్వెల్ లో సన్నీ డియోల్ ఏ తీరున అలరిస్తారో చూడాలి.