కొత్త సినిమాటోగ్రఫి బిల్లుపై హీరో సుధీర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘సినిమాటోగ్రాఫ్ (అమెడ్మెంట్) బిల్ 2021’ పై తీవ్రంగా స్పందించాడు. ‘ఇప్పటికే సినిమా ఈజీ టార్గెట్ ఉంది. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే మరింత ఈజీ టార్గెట్ గా మారిపోతుంది. అయినా రీ సెన్సార్ అనేదే ఉండేటట్లైతే ఇక ‘సీబీఎఫ్సీ’ ఎందుకు?’ అని ఆయన ప్రశ్నించాడు. అంతే కాదు, ఒకింత ఘాటుగా… ‘’నిజంగా రాజకీయ నాయకులు తాము మాట్లాడే ప్రతీ మాటకీ బాధ్యత వహించాల్సి వస్తే… వారి మీద ఎన్ని క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి? సినిమా వాళ్లు ఇప్పటికే అనేక నియమ, నిబంధనల్ని ఎదుర్కొంటూ తమ పని చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ అజమాయిషీ మంచిది కాదు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛని గౌరవించాలి’ అన్నాడు సుధీర్.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని ఆలోచిస్తోన్న తాజా సినిమాటోగ్రఫి బిల్లుపై సుధీర్ బాబు మాత్రమే కాదు ఇంకా చాలా మంది సినిమా సెలబ్రిటీలు విమర్శలు చేస్తున్నారు. గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. కమల్ హసన్ మొదలు శ్యామ్ బెనగల్ లాంటి సీనియర్స్ దాకా, సూర్య, కార్తీ లాంటి కోలీవుడ్ స్టార్స్ మొదలు ఫర్హాన్ అఖ్తర్, అనురాగ్ కశ్యప్ లాంటి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దాకా చాలా మంది తమ అసంతృప్తి ఇప్పటికే సొషల్ మీడియాలో వినిపించారు.
గత కొంత కాలంగా సినిమాల్లో, అదే విధంగా ఓటీటీ కంటెంట్ లో భారతదేశానికి వ్యతిరేకంగా, హిందూ మత విశ్వాసలకు వ్యతిరేకంగా సన్నివేశాలు, సంభాషణలు పదే పదే వస్తుండటంతో వివాదాలు చెలరేగుతున్నాయి. పోలీస్ కేసులు, కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయి. వాటన్నట్నీ దృష్టిలో పెట్టుకుని మోదీ సర్కార్ వివాదాస్పద సినిమాటోగ్రఫి సవరణ చట్టం అమల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. చూడాలి మరి, సుధీర్ బాబు లాంటి సినిమా సెలబ్రిటీల ఆగ్రహాలు ఎంత వరకూ ఢిల్లీ పెద్దల అభిప్రాయాల్ని మారుస్తాయో!
