తెలంగాణలో ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్ధులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు రద్దుచేసి, తిరిగి నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 51 శాతం విద్యార్ధులు ఫెయిలయ్యారు. ఇంటర్ ఫలితాలలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
తమకు న్యాయం చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఫెయిల్ అయింది విద్యార్థులా..? లేక ఇంటర్ బోర్డా..? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధుల్లో కొందరికి పదిలోపే మార్కులు వచ్చాయి. బాగా చదివే విద్యార్ధులకు కూడా ఒకటి రెండు సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చాయి, సర్కారీ కాలేజీ విద్యార్ధినీ, విద్యార్ధులకు ఆన్ లైన్ తరగతులు దూరం అయ్యాయి. కార్పోరేట్ కాలేజీల ప్రయోజనాలకే ఇంటర్ బోర్డు పనిచేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా 22 శాతం దిగువకు పడిపోయింది. బాలుర ఉత్తీర్ణత కూడా దారుణంగా తగ్గిపోయింది. అబ్బాయిలు 42 శాతం, అమ్మాయిలు 56 శాతం పాసయ్యారు. ఫలితాల తీరుపై విద్యార్ధులు వత్తిడికి గురవుతున్నారు. కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
