NTV Telugu Site icon

పాతికేళ్ళ ‘శ్రీకృష్ణార్జున విజయము’

పలు చిత్రాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. నటరత్న యన్టీఆర్ శ్రీకృష్ణునిగా, అర్జునునిగా పలు చిత్రాలలో మెప్పించారు. అయితే ‘శ్రీమద్విరాటపర్వము’లో రామారావు అటు శ్రీకృష్ణునిగా, ఇటు అర్జునునిగానూ నటించారు. ఆ పాత్రలతో పాటు బృహన్నల, కీచక, దుర్యోధన పాత్రలనూ అందులో పోషించారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే, తండ్రి లాగే పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలతోనూ జనాన్ని ఆకట్టుకున్నారు. రామారావు తరువాత అలా అన్ని రకాల చిత్రాలతో ప్రేక్షకులను మురిపించిన ఘనత బాలకృష్ణ సొంతం. ఇక తన తరం నటుల్లో ఈ క్రెడిట్ బాలయ్య ఒక్కరిదే అని అంగీకరించక తప్పదు. బాలకృష్ణ శ్రీకృష్ణునిగా, అర్జునునిగా నటించిన ‘శ్రీకృష్ణార్జున విజయము’ చిత్రం మే 15తో పాతికేళ్ళు పూర్తి చేసుకుంటోంది. 

తండ్రితో కాకుంటే…తనయునితో…
యన్టీఆర్ ను సూపర్ స్టార్ ను చేసిన ఘనత దిగ్దర్శకుడు కేవీ రెడ్డికే దక్కుతుంది. కేవీ రెడ్డి వద్ద అసోసియేట్ గా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావుకు యన్టీఆర్ తోనూ ఎంతో అనుబంధం ఉంది. అయితే, రామారావును దర్శకత్వం వహించే అవకాశం మాత్రం లభించలేదు. దాంతో బాలకృష్ణతో తాను తెరకెక్కించిన మూడు చిత్రాలతోనే పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాలను రూపొందించగలిగారు. ‘ఆదిత్య 369’లో ఓ వైపు సాంఘిక కథతోనే, మరోవైపు టైమ్ మిషన్ లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి పోయినట్టుగా చూపించి, చరిత్రనూ మిళితం చేశారు. ఇక బాలయ్యతో సింగీతం తెరకెక్కించిన ‘భైరవద్వీపం’ జానపదం ఈ నాటికీ జానపద చిత్రాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ రెండు చిత్రాల తరువాత బాలకృష్ణ, సింగీతం కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకృష్ణార్జున విజయము’. ‘భైరవద్వీపం’ చిత్రాన్ని నిర్మించిన చందమామ విజయా కంబైన్స్ పతాకంపైనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. విజయా సంస్థాధినేతల్లో ఒకరైన బి.నాగిరెడ్డి తనయులు బి.వెంకట్రామ రెడ్డి, ఆయన సోదరులు ‘భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయము’ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రంలో తొలుత కృష్ణుని పాత్రకు శోభన్ బాబును అనుకున్నారు. కానీ, అప్పటికే ఆయన వయసు మీద పడ్డవారు కావడం, మరికొన్ని కారణాల వల్ల వద్దనుకున్నారు. దాంతో శ్రీకృష్ణ, అర్జున రెండు పాత్రలనూ బాలకృష్ణ పోషించారు. 

నాటక ఫక్కీలో…
‘శ్రీకృష్ణార్జున విజయము’ చిత్రంలో రోజా ద్రౌపదిగా నటించగా, ప్రియా రామన్ రుక్మిణిగా, అప్సరగా రంభ కనిపించారు. దుర్యోధన పాత్రలో శ్రీహరి, కర్ణునిగా దగ్గుబాటి రాజా, నారదునిగా నరేశ్, భీమునిగా విజయరంగరాజా, ధర్మరాజుగా చక్రపాణి, కె.ఆర్.విజయ కుంతిగా, ఏవీయస్ శకునిగా నటించారు. ‘భైరవద్వీపం’కు సంగీతం సమకూర్చిన మాధవపెద్ది సురేశ్ బాణీలలోనే ఇందులోని పాటలూ రూపొందాయి. ‘భైరవద్వీపం’ అందించిన అఖండ విజయం వలన వచ్చిన అమితోత్సాహం కాబోలు, ‘శ్రీకృష్ణార్జున విజయము’లోని చిత్రీకరణ ఆకట్టుకొనేలా తెరకెక్కలేదు. సన్నివేశాలన్నీ నాటకఫక్కీలో సాగాయి. సింగీతం వంటి దర్శకుడు సైతం ఈ చిత్రాన్ని ఎందుకనో చాలా తేలికగా తీసుకొని తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. కనీసం వేషధారణల్లోనూ తగిన జాగ్రత్త వహించినట్టు కనిపించదు. ఆభరణాలు చూడగానే నాటకాల్లో వాడినట్టుగా కనిపించాయి. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ తో జిమ్మిక్స్ చేసే ప్రయత్నం చేసినా, అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.  బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో ఈ మూడో చిత్రం ఏ మాత్రం అలరించలేకపోయింది. అయితే బాలయ్య ద్విపాత్రాభినయం ఒక్కటే ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.