NTV Telugu Site icon

పాతపట్నం ఎమ్మెల్యే కేడర్‌ను పట్టించుకోవడం లేదా…?

ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డున దిగాక బోడి మల్లన్న అన్నట్టు ఉందట అక్కడ గెలిచిన ఎమ్మెల్యేల తీరు. విజయతీరాలకు తీసుకెళ్లిన కేడర్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదట. ఎమ్మెల్యేను కలిసి తమ గోడు చెప్పుకోవాలంటే అనేకమందిని దాటుకుని వెళ్లాలట. ఆ నియోజకవర్గం ఎక్కడో.. ఏంటో.. లెట్స్‌ వాచ్‌!

ఏటికి ఎదురీదే ఓటరుకి కేరాఫ్‌ అడ్రస్‌ పాతపట్నం

పేరులో పాతదనం ఉన్నా.. రాజకీయ చైతన్యంలో ఎప్పుడూ కొత్తగా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. చిన్న చిన్న పల్లెలు.. ఎదుగూబొదుగూ లేని టౌన్ల సమాహారమైనా.. పాలిటిక్స్‌లో మాత్రం టాప్‌. ఏటికి ఎదురీదే ఓటరుకి కేరాఫ్‌ అడ్రస్‌. 2014లో టీడీపీ వేవ్ నడిస్తే.. ఇక్కడ వైసీపీ గాలి వీచింది. కానీ.. వైసీపీ నుంచి గెలిచిన కలమట వెంకటరమణ కండువా మార్చేయడానికి పెద్దగా టైమ్‌ తీసుకోలేదు. ఆ సమయంలో పాతపట్నం వైసీపీ బాధ్యతలను భుజనాకెత్తుకున్నారు సీనియర్‌ రాజకీయ వేత్త పాలవలస రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతి. 2019 ఎన్నికలకు వచ్చేసరికి.. మాజీ ఎమ్మెల్యే కలమటపై ఉన్న వ్యతిరేకత.. వైసీపీ గాలి కలిసి వచ్చి రెడ్డి శాంతి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటికే టీడీపీలోని బలమైన కేడర్‌ వైసీపీలో చేరడంతో శాంతి గెలుపు నల్లేరుపై నడకైంది.

కేడర్‌ను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదట

ఇంత వరకు బాగానే ఉన్నా.. 2014 ఎన్నికల తర్వాత పాతపట్నం వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. 2019 ఎలక్షన్స్‌ తర్వాత కూడా అవే ఉన్నాయట. రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా గెలిచారనే మాటే తప్ప.. ఆమె ఎవరినీ పట్టించుకోవడం లేదని వాపోతోంది కేడర్‌. ప్రజల సమస్యల సంగతి పక్కన పెడితే మా సంగతేంటని వైసీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయట. రిబ్బన్ కటింగ్‌లు, ప్రారంభోత్సవాలు, కొబ్బరి కాయలు కొట్టేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు తప్ప.. పార్టీ వారిని కలుపుకొని వెళ్లడం లేదనే విమర్శలు అధికారపార్టీ శిబిరంలో ఉన్నాయి.

సమస్యలు చెప్పుకోవాలంటే ముగ్గురిని దాటాలట!

సమస్యలను చెప్పుకోవడానికి.. పనులు చేసి పెట్టమని అడగడానికి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం లేదన్నది వైసీపీ శ్రేణుల ఆరోపణ. ఎవరికి ఏ అవసరం ఉన్నా అంతా పీఏలకే చెప్పుకోవాల్సి వస్తోందట. అధికారికంగా ఒకరు అనధికారికంగా ఉన్న ముగ్గురు పీఏలను దాటుకుని వెళ్తేకానీ.. పార్టీ కేడర్‌ సమస్యలు ఎమ్మెల్యేగారి చెవిలో పడటం లేదట. దీంతో మొదటి నుంచి వైసీపీలో ఉన్నవాళ్లతోపాటు ఎన్నికల ముందు టీడీపీని వీడి వచ్చినవాళ్లూ తీవ్ర ఆవేదనలో ఉన్నారట. “ఛ “అనవసరంగా పార్టీ మారాం.. అక్కడే ఉంటే బాగుండేదేమోనని తెగ మథన పడుతున్నారట. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ జెండా మోసిన శ్రేణులు మాత్రం అప్పుడు గత్యంతరం లేక గెలిపించాం.. ఇప్పుడు తప్పు చేశామని తలబాదుకుంటున్నారట.

నిప్పు లేనిదే పొగ రాదంటున్న శ్రేణులు!

కేడర్‌ ఆవేదన ఎమ్మెల్యే చెంతకు చేరిందో లేదో కానీ.. పాతపట్నం వైసీపీలో అంతా బాగానే ఉందని చెబుతున్నారట. అలా అయితే నిప్పు లేనిదే పొగ రాదుగా అని గుర్తు చేస్తున్నాయట పార్టీ శ్రేణులు. మరి.. ఎమ్మెల్యేకు… వైసీపీ కేడర్‌కు మధ్య వచ్చిన ఈ గ్యాప్‌ను పార్టీ పెద్దలు ఏ విధంగా పూడుస్తారో చూడాలి.