Site icon NTV Telugu

వరంగల్‌లోని ఇంటర్‌ ఆర్జేడీ ఆఫీస్‌ తరలింపుపై చర్చ!

అది తొమ్మిది జిల్లాలకు హెడ్‌ ఆఫీస్‌. నిన్న మొన్నటి వరకు ఆ శాఖకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదు కూడా. అలాంటిది ఇప్పుడు ఆధిపత్యపోరు మొదలైంది. దానికి రాజకీయ సెగ తగలడంతో ఒక్కటే చర్చ. ఇంతకీ ఆఫీస్‌ ఏంటి? ఎందుకు వివాదాస్పదంగా మారిందో ఈ స్టోరీలో చూద్దాం.

ఇంటర్‌ విద్యలో 9 జిల్లాలకు వరంగల్‌ ఆర్వో ఆఫీస్‌ కేంద్రం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే ఇంటర్‌బోర్డులో మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రీజినల్‌ ఆఫీస్‌గా దానిని కొనసాగిస్తున్నారు. ఈ ఇంటర్‌ ఆఫీస్‌ పరిధిలో 5, 6 జోన్‌లు వస్తాయి. ఇంటర్‌ లెక్చరర్లు, ఉద్యోగుల సర్వీస్‌ మేటర్స్‌తోపాటు 14 అంశాలు ఈ రీజినల్‌ ఆఫీస్‌ పరిధిలోనే ఉంటాయి. హైదరాబాద్‌ సిటీ మినహా మిగతా 9 ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఇంటర్‌ విద్యకు సంబంధించిన హెడ్‌ ఆఫీస్‌గా భావిస్తారు కూడా. దీనికి హెడ్‌గా ఆర్జేడీ ఉంటారు.

ఆఫీస్‌ తరలించాలని ఉత్తర, దక్షిణ తెలంగాణ సెంటిమెంట్‌ రగలిస్తున్నారా?

ఎన్నడూ లేనిది ఇటీవల వరంగల్‌లో ఉన్న ఆర్వో ఆఫీస్‌ను హైదరాబాద్‌కు తరలించాలని చర్చ జరుగుతోంది. మెల్లగా మొదలైనా.. ఇప్పుడు రాజకీయ అంశంగా మారిపోయింది. ఇందుకు ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే సెంటిమెంట్‌నూ రగిలిస్తున్నారట. అయితే.. ఈ చర్చ వెనక ఒక అధికారి ఉన్నట్టు ఇంటర్‌ వర్గాల భొగొట్టా. కొందరు కావాలని చేస్తున్న డిమాండ్‌కు ఆ ఆధికారి వత్తాసు పలుకున్నారట. స్వయంగా ఈ అంశాన్ని భుజనకెత్తుకున్నారని కూడా చెబుతున్నారు. ఏకంగా ఇంటర్‌ విద్య కమిషనర్‌ను కలిసి కార్యాలయ తరలింపుపై నిలదీయడంతో.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశంలో తానేం చేస్తానని కమిషనర్‌ బదులిచ్చినట్టు తెలుస్తోంది.

ఆఫీస్‌ తరలించాలన్న అధికారిపై మాజీ ఎంపీ ఆగ్రహం

ఆ సమాధానం తర్వాత ఆ అధికారి రూటు మార్చేశారట. సీఎం కేసీఆర్‌ సన్నిహితంగా గుర్తింపు పొందిన ఒక మాజీ ఎంపీ దగ్గరకు వెళ్లారట. వెంటనే వరంగల్‌ నుంచి ఇంటర్‌ ఆర్వో ఆఫీస్‌ను హైదరాబాద్‌ తరలించేయాలని కోరారట. మొదట్లో సావధానంగానే విన్న సదరు రాజకీయ నాయకుడు.. అసలు విషయం తెలుసుకుని కస్సుమన్నారట. ఏం వేషాలు వేస్తున్నారా? వరంగల్‌ నుంచి ఇంటర్‌ ఆర్వో ఆఫీస్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తరలించేది లేదు. వెళ్లి ఎవరి పనులు వారు చేసుకోండి అని గట్టిగానే హెచ్చరించారట. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఉద్యోగవర్గాల్లో చర్చగా మారారు.

రోజూ హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు వెళ్లలేకే ఈ ఎత్తుగడ!

ఇన్నాళ్లూ హైదరాబాద్‌లో పనిచేసిన ఆ అధికారి.. ఇటీవలే పదోన్నతిపై వరంగల్‌కు బదిలీ అయ్యారట. అప్పటి నుంచి హైదరాబాద్‌ టు వరంగల్‌ అప్‌డౌన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇలా వెళ్లడం ఎందుకు? ఆ ఆఫీస్‌ ఏదో హైదరాబాద్‌లోనే ఉంటే పోలా అని అనుకున్నారో ఏమో.. వెంటనే మెదడుకు పని పెట్టారట. ఇంటర్‌ విద్యకు సంబంధించిన కొన్ని యూనియన్లను కదిపి చూశారట. ఒక యూనియన్‌ ఆ అధికారికి సానుకూలంగా ఉండగా.. మరో సంఘం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. సానుకూలంగా ఉన్న యూనియన్‌ అయితే ఏకంగా విద్యాశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చినట్టు సమాచారం.

ఆఫీస్‌ తరలింపుపై రకరకాల డిమాండ్లు!

వరంగల్‌ నుంచి ఇంటర్‌ ఆర్వో ఆఫీస్‌ను షిఫ్ట్‌ చేయకుండా.. ఆ అధికారిని అక్కడే ఉంచి.. పాత రాష్ట్రపతి ఉత్తర్వులోని 6th జోన్‌ను హైదరాబాద్‌ సిటీ జోన్‌కు అటాచ్‌ చేసి.. ఇక్కడి జాయింట్‌ డైరెక్టర్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలన్నది మరికొందరి డిమాండ్‌. మొత్తానికి తన సౌలభ్యం కోసం ఒక అధికారి ఈ విధంగా యూనియన్లను.. రాజకీయ నేతలను కదిలించడం చూసి ఇంటర్‌ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయట. మరి.. ఆ అధికారి ఇక్కడితో ఆగుతారా? లేక మరిన్ని ఎత్తులు వేస్తారో చూడాలి.

Exit mobile version