Site icon NTV Telugu

తెలంగాణలో ఆ పోస్టుకి ఎందుకంత ప్రాధాన్యం…?

ప్రభుత్వంలో సీఎస్‌, డీజీపీ పోస్ట్‌లకు డిమాండ్‌ సహజం. కానీ.. తెలంగాణలో ఈ రెండు పోస్టుల తర్వాత ఇంకో కుర్చీకి ఇటీవలకాలంలో చాలా ప్రాధాన్యం వచ్చింది. ఆ కుర్చీకోసం పోటీ కూడా పెరిగింది. ఒకప్పుడు సోదిలో కూడా లేని ఆ పోస్ట్‌కు అంతలా డిమాండ్‌ రావడానికి పెద్దకారణమే ఉందట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

2017 తర్వాత పశు సంవర్థకశాఖ డైరెక్టర్‌ పోస్ట్‌కు డిమాండ్‌!

పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌. గతంలో ఈ పోస్ట్‌లో ఎవరు ఉన్నారు. ఎవరు రిటైర్‌ అయ్యారో ఆ శాఖలో వారికి తప్పితే మిగతా వారికి పెద్దగా తెలిసేది కాదు. ఒకప్పుడు వెటర్నరీ డాక్టర్‌ దగ్గర నుంచి పశు సంవర్థక శాఖలో ఏ పెద్ద పోస్ట్‌ అయినా.. గెజిటెడ్‌ సంతకాలు అవసరమైనప్పుడు జనాలకు గుర్తొచ్చేవి. అప్పుడే వారికి డిమాండ్‌. అలాంటిది తెలంగాణలో 2017 తర్వాత పశుసంవర్థక శాఖ పోస్ట్‌కు ఒక్కసారిగా ప్రాధాన్యం వచ్చింది. ఈ పోస్ట్‌ కోసం పెద్దఎత్తున పొలిటికల్‌ లాబీయింగ్‌ చేసే వారి సంఖ్య పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో CS, DGP తర్వాత.. లేదా అంతకంటే ఎక్కువ డిమాండ్‌ ఉన్న పోస్ట్‌ యానిమల్‌ హస్బెండరీ డైరెక్టర్‌.

గొర్రెల కోసం ఏటా రూ.కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం
ఈ ఏడాది రూ. 6 వేల కోట్లు కేటాయింపు!

తెలంగాణలో గొర్రెల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఏటా వేల కోట్లు కేటాయిస్తోంది. ఒకప్పుడు పశుసంవర్థక శాఖకు నామమాత్రంగా నిధుల కేటాయింపు ఉండేది. కానీ.. గొర్రెల పంపణీ పేరుతో వేలకోట్లు వచ్చి పడుతున్నాయి. ఆ నిధులన్నీ పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ కనుసన్నల్లోనే ఖర్చు చేస్తుంటారు. ఇంత పెద్దమొత్తం అనగానే ఎవరికైనా ఆశ పుట్టకమానదు. ఆ ఆశే కుర్చీకి ఎనలేని డిమాండ్‌ వచ్చింది. ఒకవేళ కుర్చీ ఖాళీ అయితే అందులో కుర్చునేందుకు అధికారులు చేస్తున్న లాబీయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంటోందట. తెలంగాణలో పశుసంవర్థకశాఖ పరిధిలోనే గొర్రెలతోపాటు చేపపిల్లల పింపిణీ కూడా జరుగుతోంది. మొబైల్‌ చేపల విక్రయ వాహనాలు. స్టాల్స్‌ ఏర్పాటు… ఇలా చాలా విభాగాలు కాసులు కురిపిస్తున్నాయి. ఒక్క గొర్రెల కోసమే ఈ ఏడాది ప్రభుత్వం ఈ శాఖకు ఇచ్చింది అక్షరాలా 6 వేల కోట్లు.

జులై 31న ఖాళీ అయిన డైరెక్టర్‌ పోస్ట్‌!

పశుసంవర్థక శాఖలో డైరెక్టర్‌ పోస్టు జులై 31న ఖాళీ అయింది. ఆ పోస్ట్‌ కోసం వంగాల లక్ష్మారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రగతిభవన్‌ వరకు ఆయన వెళ్లినట్టు సమాచారం. అయితే ఆయనపై ఫిర్యాదులు.. ఆరోపణలు రావడంతో ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టింది సర్కార్‌. ఇదే పోస్ట్‌ కోసం మరో అధికారి మంజువాణి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. డిపార్ట్‌మెంట్‌లో సీనియారిటీ ప్రకారం తననే డైరెక్టర్‌ చేస్తారని లెక్కలు వేసుకుంటున్నారామె. ప్రస్తుతం మంజువాణి లైవ్‌స్టాక్‌ సీఈవోగా ఉన్నారు.
కేబినెట్‌లోని ఓ మంత్రి ద్వారా లాబీయింగ్‌ చేస్తున్న అధికారి పేరు కూడా ప్రచారంలో ఉంది. ఆయన ఇటీవలే అడిషనల్‌ డైరెక్టర్‌ నుంచి షీప్‌ ఫెడరేషన్‌కు ఎండీగా పదోన్నతి పొందారు. ఉద్యోగ సంఘాల నేత ఒకరు సదరు అధికారి కోసం సాయం పడుతున్నట్టు టాక్‌.

మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ లాబీయింగ్‌!

డైరెక్టర్‌ పోస్టు భర్తీ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేసేకొద్దీ ఆశావహుల సంఖ్య పెరుగుతూ వెళ్తోందట. మంత్రులను.. ఉన్నతాధికారులను కలిసేవారు రోజు రోజుకూ ఎక్కువ అవుతోందట. ఈ పోకడలు.. లాబీయింగ్‌లు చూసినవాళ్లు.. పశుసంవర్థక శాఖకు ఎంత డిమాండ్‌ వచ్చిందని ముక్కున వేలేసుకుంటున్నారు. గొర్రెలు.. చేపలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి వేల కోట్లు కేటాయిస్తుండటంతో చాలా మంది ఆ పోస్ట్‌ కోసం ఆశపడుతున్నారు. భారీగా కమీషన్లు.. వాటాలు మిగులుతుండటం వల్లే ఎగబడుతున్నారని విమర్శించేవాళ్లు లేకపోలేదు. మరి.. ప్రభుత్వం ఆలోచన ఏంటో.. ఎవరికి పట్టం కడుతుందో చూడాలి.

Exit mobile version