పరిపాలనలో ఆరితేరిన అధికారులు ఉంటే పాలకులకు.. పైవాళ్లకు వర్క్ ఈజీ. అవినీతిలో ఆరితేరిన ఘనులు ఉంటే ప్రజాప్రతినిధులు.. కమిషనర్‌లకు తిప్పలే తిప్పలు. కొన్నిసార్లు గొడవలకు దారితీస్తుంది. ఆ కార్పొరేషన్‌లో అదే జరుగుతోందట. ఏకంగా మేయర్, కమిషనర్ మధ్యే చిచ్చు పెట్టేలా వ్యవహారాలు నడిపిస్తున్నారట. వారెవరో.. ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
పాలకుల మధ్య కీచులాటలకు అవినీతి అధికారుల ఎత్తుగడ!
గుంటూరు కార్పొరేషన్‌లో కొత్త పోకడలకు తెరతీస్తున్నారు కొందరు అవినీతి అధికారులు. విభజించి పాలించాలని అనుకున్నారో ఏమో కార్పొరేటర్లకు, మేయర్ మధ్య.. మేయర్‌కు, కమిషనర్‌కు మధ్య పుల్లలు పెట్టే పనికి శ్రీకారం చుట్టారట. గడిచిన పదేళ్లుగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో స్పెషల్ ఆఫీసర్ పాలన సాగింది. ఆ సమయంలో అడిగేవారు లేక.. అందినకాడికి దండుకున్నారు కొందరు ఆఫీసర్లు. ఇప్పుడు మేయర్, కార్పొరేటర్లు రావడంతో వారు ఇరకాటంలో పడ్డారు. అవినీతికి అలవాటు పడ్డ చేతులు ఊరికే ఉండలేక పాలకుల మధ్య కీచులాట తీసుకొస్తున్నారట. ఇదే ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో హాట్ టాపిక్.
ఎవరి దగ్గర ఏ పాట పాడాలో ఆ పాట పాడుతున్నారా?
టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, జనన మరణ ధృవీకరణ విభాగాలతోపాటు మరికొన్నిశాఖల్లోని కొందరు అధికారులు, సిబ్బందికి గడిచిన పదేళ్ల కాలంలో బాగానే గిట్టుబాటు అయిందట. ఇప్పుడు కూడా అలా చేద్దామని చూస్తుంటే కార్పొరేటర్లు, మేయర్ ప్రశ్నిస్తున్నారు. దీంతో అవినీతి రాబడిలో వారి వాటాలకు గండిపడుతోంది. ఇక లాభం లేదనుకుని.. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారట. ఇటీవల ఆక్రమణల పేరుతో కొన్ని కట్టడాలను కూల్చేశారు సిబ్బంది. మేయర్ మనోహర్‌నాయుడు చెప్పమంటేనే కూల్చేశామని బదులిచ్చారట. డబ్బులిచ్చిన వారి కట్టడాలను వదిలేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న కార్పొరేటర్లు.. మేయర్‌పై భగ్గుమన్నారట. నేరుగా ఆ అధికారులనే నిలదీస్తే.. కమిషనర్ అనురాధ ఆదేశాలతో కూలగొట్టామని చెప్పారట. ఇలా ఎవరి దగ్గర ఏ పాట పాడాలో ఆ పాట పడుతూ తమ అవినీతికి అడ్డురాకుండా చూసుకుంటున్నారట.
అవినీతి రాబడిలో ఓ అధికారికి రూపాయిలో పావలా వాట?
అవినీతి రాబడంతా.. మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఓ మహిళా అధికారి దగ్గరకు చేరి.. అక్కడి నుంచి ఎవరి వాటాలు వారికి పంపిణీ చేస్తారట. వచ్చిన దాంట్లో ఆ మహిళా అధికారి రూపాయిలో పావలా వాటా తీసుకుంటారని.. మిగతా ముప్పావులా వాటా ఇతరులకు పంచుతారని చెబుతున్నారు. మేయర్‌తోపాటు కార్పొరేటర్లకు పాలనపై పెద్దగా పట్టులేకపోవడంతో.. వారిని ఆడించేస్తున్నారట ఈ అవినీతి అధికారులు. ప్రతి అంశాన్ని క్యాష్ చేసుకోవడంలో ఆరితేరినట్టు సమాచారం. మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ ఒక్కటైతే తమ పప్పులు ఉడకవని భావించి.. వారి మధ్య గ్యాప్ తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న అనురాధ.. టీడీపీ హయాంలోనూ ఇక్కడ విధులు నిర్వహించారు. ఆమెకు రెండు ప్రధాన పార్టీలలోనూ మంచి పరిచయాలే ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో మేయర్ మనోహర్ నాయుడు మాటను ఆమె లెక్క చేయడం లేదన్నది కొందరు కార్పొరేటర్ల ఆరోపణ. ఈ అభిప్రాయ భేదాలవెనక అవినీతి అధికారుల పాత్ర ఉందన్నది ఓపెన్ సీక్రెట్. అయితే విషయం తెలిసి కూడా అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నదే ప్రశ్న. ఈ అంశాన్ని కదిపితే ఏమౌతుందని భయపడుతున్నారో లేక.. మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారో కానీ… మేయర్, కమిషనర్ల తీరు ఆశ్చర్యం కలిగిస్తోందట.
