ఇప్పుడా జిల్లాలో మంత్రిగారు పెట్టుకున్న ఉంగరం హాట్ టాపిక్. ఆయనకు కరోనా వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. పార్టీలో, కేడర్‌లో ఆ ఉంగరం చుట్టూనే చర్చ జరుగుతోంది. అసలే మంత్రివర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు వస్తున్న వేళ.. అమాత్యులవారి చేతికి ఆ రింగ్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఆయనెవరో.. ఆ ఉంగరమేంటో.. ఈ స్టోరీలో చూద్దాం
నారాయణస్వామి ఉంగరంపై చర్చ!
నారాయణ స్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నుంచి వరసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ.. ఈ దఫా పెద్ద పోస్టే పట్టారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాని వివాదాలు.. మంత్రయ్యాక బాగానే చుట్టుముట్టాయి. తరచూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు. ఇప్పుడు మరో అంశం ఆధారంగా చర్చలోకి వచ్చారు నారాయణ స్వామి. ఆయన పెట్టుకున్న ఉంగరమే తాజా చర్చకు కారణం. తమిళనాడు రాజకీయాల్లో మాత్రమే అటువంటి ఉంగరం ట్రెండ్ చూస్తుంటాం. అలాంటిది ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎందుకు తీసుకొచ్చారబ్బా అంటూ ఒక్కటే చర్చ.
కేబినెట్ ప్రక్షాళనకు ముందు ఉంగరంతో ప్రత్యక్షం!
సాధారణంగా తమిళనాడు ప్రజలు అక్కడి రాజకీయాలను ఇంటిలో భాగంగా చేసుకుంటారు. మాజీ సీఎంలు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి సహా ఇతర నేతలను వారి గుండెల్లోనే కాదు.. చేతికి పెట్టుకునే ఉంగారాల్లోనూ బంధిస్తుంటారు. ఆ గోల్డెన్ రింగ్స్ ఎంత పెద్దగా ఉంటే అంత అభిమానం ఉందని లెక్క. అది అక్కడి స్పెషల్. ఆ ట్రెండ్‌ను ఆంధ్రా రాజకీయాలకు పరిచయం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. అది కూడా రెండున్నరేళ్ల కేబినెట్ ప్రక్షాణళనకు ముందు ఇలా ఉంగరంతో ప్రత్యక్షం కావడం చర్చకు ఇంకాస్త మసాలా దట్టించినట్టు అయింది.
ఉంగరంలో సీఎం జగన్‌తోపాటు వైఎస్‌ఆర్ ఫొటోలు!
అమరావతి కరకట్ట పనుల సమయంలో సీఎం జగన్ కాళ్లకు మొక్కారు!
ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో నారాయణ స్వామి తన ఉంగరాన్ని చూపిస్తూ.. పదవికోసం కాదు.. అభిమానంతో పెట్టుకున్నాను అని చెప్పడంతో అందరి దృష్టీ దానిపై పడింది. ఆ ఉంగరంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌తోపాటు ప్రస్తుత సీఎం జగన్ బొమ్మలు ఉండటంతో చర్చకు ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఇదేదో బాగుందని అనుకున్న ఆయన అభిమానులు.. పార్టీ కేడర్ అటువంటి ఉంగరాలు కోసం ఆర్డర్స్ ఇచ్చారట. అయితే ఇన్నాళ్లూ లేంది ఇప్పుడు ఆయన ఈ ఉంగరం పెట్టుకోవడానికి మంత్రివర్గ విస్తరణే కారణం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం అమరావతిలో కరకట్టపై విస్తరణ పనుల శంకుస్థాపనలో అధినేత జగన్ కాళ్లు మొక్కారు. ఇప్పుడు ఉంగరాన్ని నమ్ముకున్నారు.
మంత్రి పదవిని కాపాడుకునేందుకే ఉంగరం పెట్టుకున్నారా?
రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడా గడువు సమీపిస్తోంది. సమయం దగ్గర పడేకొద్దీ ఎందుకు బాధపడటం అని జిల్లాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. ఆ గండం నుంచి గట్టెక్కడానికే డిప్యూటీ సీఎం ఉంగరాన్ని నమ్ముకున్నారని జోకులు పేలుతున్నాయి. పదవిని కాపాడుకునేందుకు ఆయన వేస్తున్న ఎత్తుగడలు చర్చగా మారాయి. చాలా మంది జాతకం బాగుంటుందని.. మంచి భవిష్యత్ ఉంటుందని జాతిరత్నాలతో కూడిన ఉంగరాలు పెట్టుకుంటారు. నారాయణస్వామికి తన జాతకం ఎవరి చేతిలో ఉందో తెలుసు. అందుకే వారి ఫొటో ఉన్న ఉంగరాన్నే పెట్టేసుకున్నారు. మరి.. రింగ్ ఎఫెక్ట్ ఆయన రాజకీయ భవిష్యత్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
