Site icon NTV Telugu

సీఎం చెప్పిన ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు…?

ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం జగన్‌ ప్రస్తావించారా? ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? సీఎం నన్ను అన్నారంటే.. కాదు కాదు నన్నే అన్నారు అని కమలనాథులు ఎందుకు పోటీపడి చెప్పుకొంటున్నారు? ఏంటా రగడ? లెట్స్‌ వాచ్‌!

ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించిన సీఎం?

ఏపీ బీజేపీ నేతలను కట్టడి చేయాలని సీఎం జగన్‌ మంత్రులను ఇటీవల ఆదేశించారు. అఫీషియల్‌ అజెండా తర్వాత కేబినెట్‌ మీటింగ్‌లో జరిగిన రాజకీయ చర్చలో మంత్రులను ఈ విషయంలో సీఎం ప్రశ్నించారట. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన నిలదీశారట. ఈ సందర్భంగానే ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు సమాచారం. ప్రభుత్వంపై ఆ ఇద్దరూ విమర్శలు చేస్తుంటే మంత్రులు ఎందుకు ఘాటుగా తిప్పికోట్టడం లేదని అడిగారట. పైగా బీజేపీ విషయంలో మరీ ఆచితూచి వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రులకు సీఎం పరోక్షంగా స్పష్టం చేశారట.

ఒకటి వీర్రాజు పేరు.. రెండోది ఎవరు?

కేబినెట్‌ సమావేశంలో సీఎం ప్రస్తావించిన ఆ ఇద్దరు నేతలు ఎవరన్నది బీజేపీలో చర్చగా మారింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. పార్టీ కోఇంచార్జ్‌ సునీల్‌ దేవధర్‌ పేర్లను సీఎం ప్రస్తావించారని కొందరు చెబుతున్నారట. వీర్రాజుతోపాటు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి పేర్లను ఉటంకించారన్నది మరికొందరి వాదన. ఒక పేరు సోము వీర్రాజు అని ఖరారైనా.. రెండోది ఎవరన్నదే కమలనాథులకు తేలడం లేదట. పైగా కేబినెట్‌ సమావేశంలో తమ పేర్లను సీఎం ప్రస్తావించడాన్ని అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నారట బీజేపీ నేతలు. దీంతో ముఖ్యమంత్రి మమ్మల్ని అన్నారంటే మమ్మల్ని అన్నారని చెప్పుకోవడంలో పోటీ పడుతున్నారు కమలనాథులు.

సీఎం స్పందిస్తే బీజేపీ నేతల లక్ష్యం నెరవేరినట్టేనా?
అధికారపక్షం గుర్తిస్తే.. స్వపక్షంలో గుర్తింపు లభించినట్టేనా?

కార్యక్రమం ఏదైనా ఈ మధ్య వైసీపీని టార్గెట్ చెయ్యడంలో బీజేపీ జోరు పెంచింది. అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాలు కావచ్చు లేక.. హైకమాండ్‌ దృష్టిలో పడే ప్రయత్నం కావచ్చు.. దూకుడు పెంచారు నాయకులు. ఇదే సందర్భంలో తాము మాట్లాడింది.. తెరపైకి తెచ్చిన అంశాలు కూడా అందరి దృష్టిలో పడాలి అనుకుంటున్నారట. సీఎం లాంటి వారు తమ ఆరోపణలు, కార్యక్రమాలకు స్పందిస్తే తమ లక్ష్యం నెరవేరినట్టేనని భావిస్తున్నారట. కేబినెట్‌ మీటింగ్‌లో సీఎం చేసిన కామెంట్స్‌పై బీజేపీ నేతలు ట్విటర్‌లో, పార్టీ వేదికలపైనా ఇప్పటికే స్పందించారు. అయితే రెండో నేత ఎవరో అంతుచిక్కడం లేదట. అధికారపక్షంలో ఇలా తమను గుర్తిస్తేనే.. స్వపక్షంలో గుర్తింపు లభిస్తుందని భావించారో ఏమో.. కమలనాథుల్లో మాత్రం ఆరాటం కనిపిస్తోందని టాక్‌.

Exit mobile version