Site icon NTV Telugu

నేడు దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం : సీఎం కేసీఆర్ డుమ్మా !

తిరుపతిలో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. సౌత్‌ స్టేట్స్‌ జోనల్ కౌన్సిల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్‌గా ఉండగా… ఏపీ ముఖ్యమంత్రి YS జగన్… వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ఆతిథ్య నిర్వహణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఇవాళ తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు.. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ సీఎంలతో పాటు పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కావాల్సిఉంది.

పలువురు కేంద్ర మంత్రులు, ప్రతినిధులు, అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. SZC ఉపాధ్యాక్షుడి హోదాలో ఏపీ సీఎం జగన్ కూడా రానున్నారు.ఈ ఏడాది మార్చిలోనే ఈ మీటింగ్‌ జరగాల్సి ఉన్నా… అప్పుడు అమిత్ షా అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఇవాళ్టికి రీ షెడ్యూల్‌ అయిన ఈ మీటింగ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బదులు.. ఆ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై .. ఏపీ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించనున్నారు సీఎం జగన్‌. మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించి కేంద్ర సహాయాన్ని కోరనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను అజెండాలో పొందుపరిచారు.

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎఫ్‌డీ ఖాతాల స్తంభన.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ సమావేశంలో ప్రస్తావించనున్నారు సీఎం జగన్‌. కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశం, నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనలు వంటి కీలక అంశాలపై పూర్తి సమాచారంతో ఏపీ అధికారులు సిద్ధం అయ్యారు. ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాలపై కూడా గట్టిగా సమాధానం ఇచ్చే విధంగా ప్రభుత్వం గణాంకాలతో సహా తమ వాదన వినిపించటానికి రెడీ అయింది, సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగేటట్లు చూడాలన్న ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ విషయంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్‌.

Exit mobile version