పీఆర్సీ ప్రకటన తర్వాత జీతాలు తగ్గుతాయని ఉద్యోగుల్లో ఆందోళన రేగిన మాట వాస్తవనని ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి అన్నారు. పీఆర్సీ ప్రకటన తర్వాత 4 శాతం నష్టపోయినా హెచ్ఆర్ఏ ప్రస్తుతం కొనసాగుతున్న విధంగా ఉంటే ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. అధికారుల కమిటీ సిఫార్సులను అమలు చేస్తే ఉద్యోగులు నష్టపోవాల్సిందేనని, ఇదే విషయాన్ని సీఎంఓ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి వివరించి చెప్పామన్నారు.
పీఆర్సీ ప్రకటన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో కొందరు అపోహలు పడుతున్నారని గ్రామ వార్డు సచివాలయల రాష్ట్ర అధ్యక్షుడు జానీ భాషా వెల్లడించారు. ప్రొబేషన్ విషయంలో ఆందోళన చెందిన మాట వాస్తవమేనని, ఎవరు పెన్ డౌన్ చేయాలన్న ఆందోళనకు పిలుపు ఇవ్వలేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా వారిలో ఆందోళనను ఎగదోస్తున్నారని భావిస్తున్నామని, ఈ నెల 10 తేదీన గ్రామవార్డు సచివాలయాల ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమావేశం ఉందని ఆయన వెల్లడించారు.
