మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలల్లో శరద్ పవార్ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. శరద్ పవార్ పార్టీ కేవలం 12 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘోర పరాజయం తర్వాత 84 ఏళ్ల శరద్ పవార్ ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే ఆయనకు చివరి ఎన్నికలా? రాజకీయాల చివరి గేమ్‌లో శరద్ పవార్ ఎలా ఓడిపోయారు? అనే పలు విషయాలను గురించి తెలుసుకుందాం..
ఎన్నికల ప్రచారంలో రిటైర్మెంట్ సంకేతాలు..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సూచించారు. తాను ఇక నుంచి ఏ ఎన్నికల్లో పోటీ చేయనని, అయితే పార్టీ సంస్థాగత పనులను మాత్రం కొనసాగిస్తానని పవార్ స్పష్టం చేశారు. అంటే ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ పదవిపై ఆయన పని కొనసాగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బారామతిలో ఆయన మాట్లాడుతూ.. “నేను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదు. కొత్త వ్యక్తులు ముందుకు రావాలి. ఇప్పటికి 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. ఇప్పుడు నాకు అధికారం అక్కర్లేదు. సమాజం కోసం పని చేయాలనుకుంటున్నాను. రాజ్యసభకు వెళ్లాలా వద్దా అనేది ఆలోచిస్తాను.” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఆయన పార్టీ కేవలం 12 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలే ఆయనకు చిట్టచివరి అని భావిస్తున్నారు.
కేంద్ర , రాష్ట్ర రాజకీయాలను శాసించిన శరద్ పవార్
శరద్ పవార్ పూర్తి పేరు శరద్చంద్ర గోవిందరావు పవార్. మహారాష్ట్రకు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా కేంద్ర మంత్రి మండలిలో కూడా ఉన్నారు. నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ల మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. శరద్ పవార్ 1960లో కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1960లో కాంగ్రెస్ నాయకుడు కేశవరావ్ జెఢే మరణించడంతో బారామతి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఉపఎన్నికలో, పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే PWP శరద్ అన్నయ్య బసంత్రావు పవార్‌కు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ గులాబ్రావ్ జేఢేని నిలబెట్టింది. అప్పట్లో వైబీ చవాన్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు.
శరద్ పవార్ తొలిసారి బారామతి నుంచి ఎమ్మెల్యే..
శరద్ పవార్ తన ‘ఆన్ మై ఓన్ టర్మ్స్’ పుస్తకంలో నా సోదరుడు కాంగ్రెస్‌కు వ్యతిరేక అభ్యర్థి అని రాశారు. ‘ఆన్ మై ఓన్ టర్మ్స్’ పుస్తకం ప్రకారం.. నేను కాంగ్రెస్ నేతను. నా సోదరుడు కాంగ్రెస్‌కు వ్యతిరేక అభ్యర్థి. ఇది నాకు చాలా క్లిష్ట పరిస్థితి. కానీ.. నా సోదరుడు బసంత్రావు నా సమస్యను అర్థం చేసుకున్నాడు. నాకు ఫోన్ చేసి.. “నువ్వు కాంగ్రెస్ సిద్ధాంతానికి అంకితం. నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వెనుకాడవద్దు” అని చెప్పాడు. నేను నా జీవితాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి అంకితం చేశారు. ఫలితంగా గులాబ్రావ్ జేఢే గెలిచారు. కాగా.. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన శరద్‌పవార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి..1999లో ఎన్సీపీని స్థాపించారు. ప్రముఖ రాజకీయ నాయకుడిగా సేవలందించారు. శరద్ పవార్ కేవలం 27 ఏళ్ల వయసులో 1967లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. శరద్ పవార్ గత 5 దశాబ్దాలలో 14 ఎన్నికల్లో విజయం సాధించారు.
శరద్ పవార్ తన పార్టీ విభజనను ఎదుర్కొన్నారు
జూన్ 10, 2023న, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లను పార్టీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా చేశారు. శరద్ తీసుకున్న ఈ నిర్ణయంతో అజిత్ పవార్ మండిపడ్డారు. సరిగ్గా 2 నెలల తర్వాత, 2 జూలై 2023న, అజిత్ పవార్ 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి తన ఎన్‌సీపీ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ ఎన్సీపీపై దావా వేశారు. 29 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఎన్సీపీ పార్టీ పతనం అంచున ఉంది. తనకు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ ప్రకటించారు. అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్‌సీపీ అని ఎన్నికల సంఘం 6 ఫిబ్రవరి 2024న చెప్పింది. 6 నెలల పాటు జరిగిన 10 విచారణల అనంతరం పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఘడి అజిత్ వర్గానికి ఇచ్చారు. దీని తర్వాత కమిషన్ శరద్ పవార్ వర్గానికి ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ అని పేరు పెట్టింది. ఈ పార్టీ ఎన్నికల గుర్తు ట్రంపెట్. ఈ విధంగా ఎన్సీపీ పార్టీ రెండుగా చీలిపోయింది.
మామ, మేనల్లుడి మధ్య జరిగిన రాజకీయ పోరు
మహారాష్ట్ర రాజకీయాల్లో మామ, మేనల్లుళ్ల మధ్య విభేదాలు తలెత్తడంతో అజిత్ పవార్ బీజేపీ, శివసేన షిండే వర్గాల మహాకూటమిలో చేరారు. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన కాంగ్రెస్, శివసేన ఉన్న మహావికాస్ అఘాడికి శరద్ పవార్ మద్దతు తెలిపారు. మామ, మేనల్లుడి మధ్య జరిగిన రాజకీయ పోరులో మేనల్లుడు గెలిచారు.