NTV Telugu Site icon

కితకితలు పెట్టిన పద్మనాభం పకపకలు

Basavaraju Venkata Padmanabha Rao

Basavaraju Venkata Padmanabha Rao

(ఆగస్టు 20న పద్మనాభం జయంతి)

తెలుగు సినిమా నవ్వుల తోటలో పద్మనాభం ఓ ప్రత్యేకమైన పువ్వు. నవ్వు నాలుగందాల చేటు అంటారు కానీ, పద్మనాభం నవ్వును నాలుగు వందల విధాలా గ్రేటు అనిపించారు. ఆయన నటించిన వందలాది చిత్రాలను పరిశీలిస్తే, ఒక్కో సినిమాలో ఒక్కోలా నవ్వుతూ అలరించారు. ఆయన నవ్వులను అనుకరిస్తూ ఆ రోజుల్లో కుర్రకారు తమ చుట్టూ ఉన్నవారికి కితకితలు పెట్టేవారు. కేవలం హాస్యనటునిగానే కాదు, నిర్మాతగా, దర్శకునిగానూ పద్మనాభం సాగారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ ‘రేఖా అండ్ మురళీ కంబైన్స్’ పతాకంపై అనేక చిత్రాలు రూపొందించి అలరించారు.

గూడవల్లి రామబ్రహ్మం తెరకెక్కించిన ‘మాయాలోకం’ చిత్రం ద్వారా పద్మనాభం చిత్రసీమలో ప్రవేశించారు. అంతకు ముందు కడప జిల్లా తన స్వస్థలం సింహాద్రి పురంలోనూ, చుట్టుపక్కల నాటకాల్లో నటిస్తూ నవ్విస్తూ ఉండేవారు పద్మనాభం. అతనిలోని చలాకీ తనం చూసిన మహానటి కన్నాంబ, పద్మనాభంను చిత్రసీమకు ఆహ్వానించారు. అలా ఆమె ప్రోత్సాహంతో పద్మనాభం అరకొర పాత్రలు పోషిస్తూ సాగారు. విజయా సంస్థలో పర్మినెంట్ ఆర్టిస్ట్ గా చేరారు. ‘షావుకారు, పాతాళభైరవి’ చిత్రాలలో నటించడంతో మంచి గుర్తింపు సంపాదించారు. అప్పటి నుంచీ మహానటుడు యన్టీఆర్ ను అభిమానిస్తూ, ఆయన హీరోగా నటించిన చిత్రాల్లోనూ, నిర్మించిన సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు పద్మనాభం. నాటి మేటి హీరోలందరి చిత్రాల్లోనూ పద్మనాభం తనదైన హాస్యంతో అలరించారు. కొన్ని చిత్రాలలో విలన్ గానూ మెప్పించారు. కొన్నిట కేరెక్టర్ యాక్టర్ గా ఆకట్టుకున్నారు.

యన్టీఆర్ ను కాల్ షీట్స్ అడిగి నిర్మాతగా తొలి ప్రయత్నంలో ‘దేవత’ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తరువాత తమ రేఖా అండ్ మురళీ కంబైన్స్ పతాకంపై అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. తొలుత కె.హేమాంబరధర రావు దర్శకత్వంలో కొన్ని చిత్రాలు నిర్మించారు పద్మనాభం. తరువాత తానే స్వీయ దర్శకత్వంతో సాగిపోయారు. ఆయన నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ’ చిత్రంతోనే ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఆయన దర్శకత్వంలో ‘శ్రీరామకథ’ చిత్రం జనాదరణ పొందింది. ‘పెళ్ళికాని తండ్రి’ ఆయన నిర్మించిన చివరి చిత్రం.

‘శ్రీరామకథ’తో పాటు ‘మిడతంబొట్లు, కథానాయిక మొల్ల, పెళ్ళికాని తండ్రి’ చిత్రాలు ఆయన దర్శకత్వంలో రూపొందాయి. గీతాంజలి ఆయన హిట్ పెయిర్ గా రాణించారు. వాణిశ్రీ సైతం కొన్ని చిత్రాల్లో పద్మనాభంకు జోడీగా నటించి మురిపించారు. ఇలా ఎందరికో పద్మనాభం లక్కీ హ్యాండ్ గా నిలిచారు. అయినవారే మోసం చేయడంతో పద్మనాభం ఆస్తులు పోగొట్టుకున్నారు. దాంతో చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. కొందరు దర్శకనిర్మాతలు ఆయన కోసమే అన్నట్టుగా కొన్ని పాత్రలు సృష్టించి, పద్మనాభంను నటింప చేశారు. ఏది ఏమైనా తనలా ఎవరూ కాకూడదని, ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉండేవారు. పద్మనాభం హాస్యం మాత్రం తెలుగువారి మదిలో చెరగని స్థానం సంపాదించింది.