Site icon NTV Telugu

ఐపీఎల్ 2022: కొత్త కోచ్‌ను ప్రకటించిన ఆర్‌సీబీ

ఐపీఎల్ 2022 మెగా వేలం త్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో వేలానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులకు దిగింది. దీంతో ప్రధాన కోచ్‌ పేరును మంగళవారం నాడు ప్రకటించింది. ఆర్‌సీబీ తదుపరి కోచ్‌గా సంజయ్ బంగర్ పనిచేయనున్నట్లు ఆర్‌సీబీ యాజమాన్యం వెల్లడించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో సంజయ్ బంగర్ బ్యాటింగ్ కోచ్‌గా ఆర్‌సీబీ జట్టుకు సేవలు అందించాడు. ఇప్పుడు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. వచ్చే రెండు సీజన్‌ల వరకు సంజయ్ బంగర్ ఈ పదవిలో కొనసాగనున్నాడు.

అయితే గతంలో ఆర్‌సీబీ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన మైక్ హెస్సన్ ఇకపై ఆర్‌సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. 2021 ఐపీఎల్‌ సీజన్ ప్రారంభంలో అతడు ప్రధాన కోచ్‌గా బాధ్యతలను స్వీకరించాడు. అంతకుముందు 2014 నుంచి 2016 వరకు పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున పనిచేశాడు. కాగా ఐపీఎల్ 2022 సీజన్ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో భారత్‌లోనే జరగనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ప్రవేశించనున్నాయి. దీంతో మొత్తం టీమ్‌ల సంఖ్య 10కి చేరనుంది. జట్ల సంఖ్యతో పాటు ఇకపై మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి.

Read Also: ఆటగాళ్లు మనుషులు… యంత్రాలు కాదు: రవిశాస్త్రి

Exit mobile version