NTV Telugu Site icon

‘టాకీపులి’ హెచ్.ఎమ్.రెడ్డి

Remembering Legendary Director HM Reddy on his Birth Anniversary

(జూన్ 12న హెచ్.ఎమ్.రెడ్డి జయంతి)
బుర్రమీసాలు, ఆరడుగుల ఎత్తు, చూడగానే ఎదుటివారు జడుసుకొనేలా తీక్షణమైన చూపు- ఇవన్నీ కలిపి తొలి తెలుగు చిత్ర దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డిని అందరూ ‘పులి’ అని పిలిచేలా చేశాయి. తొలి దక్షిణాది టాకీ ‘కాళిదాసు’కు దర్శకత్వం వహించి, తొలి తెలుగు చిత్రంగా రూపొందిన ‘భక్త ప్రహ్లాద’ను తెరకెక్కించి ‘టాకీ పులి’గా జనం మదిలో నిలిచిపోయారు హెచ్.ఎమ్.రెడ్డి. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘కాళిదాసు’లో పాటలు, ముఖ్యపాత్రధారుల మాటలు తెలుగులో ఉన్నాయి. మరికొన్ని పాత్రధారుల సంభాషణలు తమిళంలో సాగాయి. ఆ విధంగా భారతదేశంలో రూపొందిన తొలి మిశ్రమ భాషాచిత్రం’ కాళిదాసు’ అనే చెప్పాలి. తరువాతే పూర్తి స్థాయిలో తెలుగు చిత్రంగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది.

చిత్రసీమలో ‘పులి’ సంచారం!
‘టాకీ పులి’ హెచ్.ఎమ్.రెడ్డి 1892 జూన్ 12న జన్మించారు. ఆయన పూర్తి పేరు హనుమప్ప మునియప్ప రెడ్డి. ఆ రోజుల్లో దక్షిణాది అంతటా తెలుగువారిదే పై చేయి. బ్రిటీష్ పాలనలో ఇంగ్లిష్, హిందీ భాషల తరువాత తెలుగుకే ప్రాధాన్యమిచ్చారు. ఆ నాటి నాణ్యాలపై ఈ మూడు భాషలే దర్శనమిచ్చేవి. అదే తీరున తెలుగువారు సైతం దేశంలోని పలు ముఖ్యనగరాలలో జీవనం సాగించేవారు. అలా హెచ్.ఎమ్.రెడ్డి కన్నవారు బెంగళూరు చేరారు. అక్కడే ఆయన పట్టా పుచ్చుకున్నారు. తరువాత అదే నగరంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గానూ పనిచేశారు. అయితే అప్పట్లో ఉరకలు వేసే ఉత్సాహం ఉన్న హెచ్.ఎమ్.రెడ్డిలో తాను బ్రిటిష్ వారి వద్ద పనిచేయడం ఏమిటి అని భావించి, ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. తరువాత హైదరాబాద్ వచ్చి జాగీర్దార్ కాలేజ్ లో ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేశారు. అదే సమయంలో హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి ప్రబలడంతో బొంబాయి వెళ్ళారు రెడ్డి. అప్పటికే రెడ్డి బావమరిది హెచ్.వి.బాబు సినిమా రంగంలో ఉన్నారు. దాంతో రెడ్డికి కూడా చిత్రసీమలో చేరాలన్న కోరిక కలిగింది. బాబు సాయంతో సునాయాసంగానే రెడ్డి చిత్రసీమలో కాలుమోపారు. అలా మూకీ చిత్రాలలో నటిస్తూనే సినిమా టెక్నిక్ ను అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు. రెడ్డికి ఇంగ్లిష్ భాష మీద పట్టు ఉండడంతో ఆ నాటి బ్రిటిష్ వాళ్ళతోనూ, సినిమా టెక్నీషియన్స్ తోనూ ఇట్టే ఇంగ్లిష్ లో మాట్లాడేవారు. ఆ అంశం ‘ఇంపీరియల్ కంపెనీ’ యజమాని ఆర్దేషీర్ ఇరానీకి ఎంతగానో నచ్చింది. ఆర్దేషీర్ కోరిక మేరకు ఆయన సంస్థకు ‘విజయ్ కుమార్’, ‘ ఏ వేజర్ ఇన్ లవ్’ అనే మూకీ చిత్రాలను రూపొందించారు. ఈ రెండు చిత్రాల్లోనూ పృథ్వీరాజ్ కపూర్ ముఖ్యపాత్ర ధారి. తరువాత ఆర్దేషీర్ ఇరానీ తొలి ఇండియన్ టాకీగా ‘ఆలమ్ ఆరా’ తెరకెక్కించారు. ఈ చిత్ర రూపకల్పనలో హెచ్.ఎమ్.రెడ్డి ఎంతగానో సహకరించారు. దాంతో ఆర్దేషీర్ ఇరానీ, హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు నిర్మించాలని భావించారు. అలా హెచ్.ఎమ్. రెడ్డి దర్శకత్వంలో దక్షిణాది తొలి టాకీలుగా ‘కాళిదాసు’, ‘భక్త ప్రహ్లాద’ తెరకెక్కి, అలరించాయి.

రెడ్డి చేతి చలువ…
భారతదేశంలో తొలి టాకీలుగా రూపొందిన ‘ఆలమ్ ఆరా, కాళిదాసు, భక్త ప్రహ్లాద’ ఈ మూడు చిత్రాలలోనూ ఎల్.వి.ప్రసాద్ నటించారు. అలాగే ఆ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ ప్రసాద్ పనిచేశారు. ముఖ్యంగా హెచ్.ఎమ్.రెడ్డికి ప్రసాద్ పని బాగా నచ్చింది. అలా తాను నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలకు ప్రసాద్ ను అసిస్టెంట్ గా పెట్టుకున్నారు రెడ్డి. తన బావమరిది దర్శకత్వంలో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ తీయించి, దానికి పర్యవేక్షకునిగా వ్యవహరించారు రెడ్డి. ఈ సినిమా మంచి విజయం సాధించింది. పోటీ చిత్రంగా వచ్చిన ‘ద్రౌపదీ మానసంరక్షణ’ పరాజయం పాలయింది. అయితే ఈ రెండు చిత్రాలపై కృష్ణాపత్రికలో కమలాకర కామేశ్వరరావు సమీక్ష రాస్తూ, ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ విజయం సాధించినా, సాంకేతిక పరంగా ‘ద్రౌపదీ మానసంరక్షణ’ ఉన్నతంగా ఉందని అందరూ మెచ్చేలా రాశారు. అది చూసిన హెచ్.ఎమ్.రెడ్డి తమ సినిమాను విమర్శించిన కమలాకర కామేశ్వరరావును అదే పనిగా మద్రాసు పిలిపించి, తమ చిత్రాలకు పనిచేసేలా చేశారు. రెడ్డి పర్యవేక్షణలో రూపొందిన ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ సినిమా ద్వారానే తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకులయిన గూడవల్లి రామబ్రహ్మం ప్రొడక్షన్ మేనేజర్ గా చిత్రసీమలో ప్రవేశించారు.

భలే బంధాలు…
తరువాత హెచ్.ఎమ్.రెడ్డి ‘రోహిణీ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థలో బి.యన్.రెడ్డి, మూలా నారాయణస్వామి భాగస్వాములు. బి.యన్. రెడ్డి కూడా హెచ్.ఎమ్.రెడ్డి వద్దే చిత్రనిర్మాణ మెలకువలు తెలుసుకున్నారు. తరువాత ‘మల్లీశ్వరి’ వంటి కళాఖండాన్ని రూపొందించారు బి.యన్.రెడ్డి. 1938లో హెచ్.ఎమ్. రెడ్డి తమ రోహిణీ పిక్చర్స్ పతాకంపై నిర్మించి, దర్శకత్వం వహించిన ‘గృహలక్ష్మి’ మంచి విజయం సాధించింది. ఆ తరువాత బి.యన్.రెడ్డి, మూలా నారాయణ స్వామి విడిపోయి సొంతగా ‘వాహినీ పిక్చర్స్’ సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. “మాతృభూమి, చదువుకున్న భార్య, బోండాం పెళ్ళి, బారిష్టర్ పార్వతీశం, తెనాలి రామకృష్ణ, సతీ సీత, ఘరానాదొంగ, నిర్దోషి, నిరపరాధి, ప్రతిజ్ఞ” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు హెచ్.ఎమ్. రెడ్డి. రోహిణీ స్టూడియోస్ ను కూడా నెలకొల్పారు. అప్పటి దాకా చిన్న చిన్న వేషాలు, ప్రతినాయక పాత్రలు వేసుకుంటున్న ముక్కామలను తన ‘నిర్దోషి’ చిత్రంతో హీరోని చేశారు హెచ్.ఎమ్.రెడ్డి. ‘నిర్దోషి’లో ఓ చిన్న వేషంలో కనిపించిన టి.ఎల్. కాంతారావును జానపద చిత్రం ‘ప్రతిజ్ఞ’తో హీరోగా నిలిపారు రెడ్డి. ఇదే చిత్రం ద్వారా రాజనాల చిత్రసీమకు పరిచయం కావడం విశేషం. యన్టీఆర్ హీరోగా రోహిణీ పిక్చర్స్ పతాకంపై ‘వద్దంటే డబ్బు’ నిర్మించారు. వై.ఆర్. స్వామి దర్శకత్వంలో రూపొందిన ‘వద్దంటే డబ్బు’కు హెచ్.ఎమ్.రెడ్డి సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

హెచ్.వి.బాబు, గూడవల్లి రామబ్రహ్మం, బి.యన్.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, కాంతారావు, రాజనాల, సదాశివబ్రహ్మం, భమిడిపాటి కామేశ్వరరావు వంటివారు చిత్రసీమలో ప్రవేశించడానికి హెచ్.ఎమ్.రెడ్డి కారకులు కావడం విశేషం. ‘గజదొంగ’ అనే చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉండగా హెచ్.ఎమ్.రెడ్డి 1960 జనవరి 14న కన్నుమూశారు. మన దేశంలో సినిమా చరిత్రను అధ్యయనం చేసే ప్రతీవ్యక్తి హెచ్.ఎమ్.రెడ్డిని గురించి తెలుసుకోవలసిందే.

Show comments