ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషిచేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు పర్యటిస్తూనే భారీ హామీలు గుప్పిస్తున్నారు. ఇక రైతుల చట్టాలు, లఖీంపూర్ ఖేరీ ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు ప్రదర్శించింది. రైతు సంఘాల తరుపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు.
Read: 2022లో బైక్ ప్రియులకు పండగే పండగ… ఎందుకంటే…
ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. 1980 నుంచి కాంగ్రెస్ పార్టీకి రాయ్‌బరేలీ కంచుకోటగా ఉన్నది. అదితి సింగ్ తండ్రి అఖిలేష్ సింగ్ ఐదుసార్లు ఆ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సోనియాగాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొన్నటి వరకు ప్రియాంక గాంధీతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న అదితి సింగ్ సడెన్‌గా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని ఆమె విమర్శలు చేసింది.
