(సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు)
“నా రూటే సెపరేటు” అంటూ సాగుతున్న నటదర్శకరచయిత ఉపేంద్రకు కన్నడనాట తరగని క్రేజ్! తెలుగునేలపైనా ఉపేంద్రకు ఉన్న ఆదరణ తక్కువేమీ కాదు. నలుగురు నడచిన బాటలో కాకుండా, తనదైన పంథాలో పయనించి నలుగురినీ మెప్పిస్తున్న ఘనుడు ఉపేంద్ర. నటునిగా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా ఉపేంద్ర పలు పాత్రలు పోషిస్తూనే జనాన్ని ఆకట్టుకుంటున్నారు. డొంక తిరుగుడు లేకుండా, ముక్కుసూటిగా మాట్లాడటం ఉపేంద్ర నైజం. అందుకే ఆయన సినిమాల్లోనూ ఆ విలక్షణం కనిపిస్తూ ఉంటుంది. అదే జనాన్ని మైమరిపిస్తూ ఉంది. అందుకే ప్రేక్షకులు ‘ఉప్పి’ అంటూ అభిమానంగా ఆయనను ఆరాధిస్తున్నారు. జనం కోసం మనం అంటూ ప్రజా వాణి వినిపించాలని 2018లో ‘ఉత్తమ ప్రజాకీయ పక్ష’ అనే రాజకీయ పార్టీని ఆరంభించారు. తాను పోటీ చేయకుండా పలువురు అభ్యర్థులను బరిలోకి దింపారు ఉపేంద్ర. అయితే సినిమాల్లోలాగా రాజకీయాల్లో విజయం ఆయనను వరించలేదు. అయినా సరే, జనం పక్షాన నిలచి పోరాడుతూనే ఉంటానని అంటారు ఉపేంద్ర.
కన్నడ సీమలోని ఉడిపి సమీపంలో ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు ఉపేంద్రరావు. బెంగళూరులోని ఏపీయస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బి.కామ్., చదివారు ఉపేంద్ర. చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు రాయడం, వాటిలో నటించడం అంటే ఉపేంద్రకు ఎంతో ఇష్టం. అతని హంగామా చూసి మిత్రులు సినిమాల్లో చేరిపో అంటూ ప్రోత్సహించేవారు. ప్రముఖ కన్నడ నటదర్శకుడు కాశీనాథ్ ఉపేంద్రకు దూరపు బంధువు. డిగ్రీ పూర్తి కాగానే, కాశీనాథ్ వద్ద అసోసియేట్ గా చేరిపోయారు ఉపేంద్ర. ఆయన దగ్గర పనిచేస్తూనే తన మనసుకు నచ్చిన కథలను రాసుకుంటూ ఉండేవారు. కాశీనాథ్ తెరకెక్కించిన ‘అనంతన అవాంతర’ అనే కన్నడ సినిమాకు అసోసియేట్ గా పనిచేయడమే కాదు, అందులో కామదేవుని పాత్రలో కాసేపు తెరపై కనిపించారు ఉపేంద్ర. రెండు సినిమాలు కాగానే తాను రూపొందించుకున్న కథతో ‘తర్లే నన్ మగ’ చిత్రాన్ని రూపొందించారు. ఈ తొలి ప్రయత్నంలోనే ఉపేంద్రకు దర్శకునిగా మంచి పేరు లభించింది. ‘ష్!’ చిత్రంతో వైవిధ్యం చూపించారు. ఉపేంద్ర దర్శకత్వంలో మూడో చిత్రంగా ‘ఓం’ తెరకెక్కింది. శివరాజ్ కుమార్ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. 1995లో టాప్ గ్రాసర్ గానూ ‘ఓం’ రికార్డ్ సృష్టించింది. ‘ఓం’ చిత్రాన్ని తెలుగులో రాజశేఖర్ హీరోగా ‘ఓంకారం’ పేరుతో ఉపేంద్ర దర్శకత్వంలోనే రూపొందించారు.
‘ఓంకారం’తోనే తెలుగువారికీ దగ్గరయ్యారు ఉపేంద్ర. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘ఎ’ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులోనూ అనువాదమై అలరించింది. దాంతో ఉపేంద్రకు నటునిగానూ తెలుగునాట క్రేజ్ లభించింది. ఇ.వి.వి. సత్యనారాయణ తన ‘కన్యాదానం’లో ఉపేంద్రను ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఎంచుకున్నారు. ఈ సినిమా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేక పోయింది. ‘ఉపేంద్ర’ చిత్రం తెలుగు కన్నడ భాషల్లో విజయం సాధించింది. ఆ పై “ఒకే మాట, రా!, నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్నాఫ్ సత్యమూర్తి” వంటి తెలుగు చిత్రాల్లో హీరోగానూ, కీలక పాత్రల్లోనూ నటించారు ఉపేంద్ర. ఉపేంద్ర కన్నడలో హీరోగా నటించిన అనేక చిత్రాలు తెలుగులో అనువాదమై ఎంతగానో మురిపించాయి. ద్విపాత్రాభినయాలతోనూ, త్రిపాత్రాభినయాలతోనూ ఉపేంద్ర ఆకట్టుకున్న తీరే వేరు అని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘ఘని’లోనూ ఉపేంద్ర కీ రోల్ లో కనిపించనున్నారు.
ఉపేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు ఇంకా సమయం ఉందని చెబుతున్నారు ఉప్పి. మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఉపేంద్ర మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.