జై భీమ్ చిత్రంలోని ఓ సన్నివేశంలో లాయర్ చంద్రు (సూర్య) కాలు మీద కాలు వేసుకుని ఠీవిగా న్యూస్ పేపర్ చదువుతుండగా.. అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చున్న గిరిజన చిన్నారి అతనిని అనుసరిస్తూ.. పేపరు చేతిలోకి తీసుకుంటూ… భయం భయంగా చూస్తూ ఉంటుంది.
ఇంతలో చంద్రు ఆ పాపకేసి ఎవరికీ భయపడకు (నువ్వు భయపడకు.. నువ్వు అనుకున్నదే చేయి.. ఈ సమాజంలో నీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకో.. ఆడపిల్ల అంటే ఆబల కాదు సబల అని నిరూపించుకో) అన్నట్టుగా చూస్తాడు. చంద్రు చూపుతో ఆ చిన్నారిలో ఆత్మవిశ్వాసం.. కాలు మీద కాలు వేసుకుని చేతిలో పేపరుతో ఠీవిగా కూర్చుంటుంది.. ఇలాంటి మార్పును కోరుకునే వ్యక్తే గంధం చంద్రుడు ఐఏఎస్.. ‘బాలికే భవిష్యత్తు’తో ఆచరణలోనూ చూపించిన అరుదైన అధికారి..
అది 11 అక్టోబర్ 2020 అనంతపురం జిల్లా కలెక్టరుగా పనిచేసిన గంధం చంద్రుడు సామాజిక రుగ్మతలపై చిన్నతనం నుంచే యుద్ధం చేస్తోన్న ఆయన.. ఓ అధికారిగా బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షతను.. అన్ని ప్రాంతాల్లోని బాలికలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం, చదువుకు దూరంగా పెట్టటం.. వంటివి రూపుమాపేందుకు తన వంతు బాధ్యతను నెరవేర్చేందుకు
ముందడుగు వేశారు.
11 అక్టోబర్ 2020న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ‘బాలికే భవిష్యత్తు’ అన్న వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బాలికలను ఒక్క రోజు అధికారిణులుగా మార్చే కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని గ్రామాల్లో ఉన్న చిన్న స్థాయి అధికారి వరకు ఒక్కరోజు బాలికలను అధికారులుగా మార్చారు. వారి కాన్ఫిడెన్స్ ను వెయ్యి రెట్లు పెంచాడు. వారిలో నేనేమైనా సాధించగలను అన్న విశ్వాసాన్ని కలిగించాడు.
వారిచేత సమస్యలను పరిష్కరించేలా చేసి, ఆ బాలికలు చూపిన సహేతుకమైన పరిష్కారాలను అమలు అయ్యేలా చూశారు. కలెక్టర్‌గా ఆయన చేసిన ఈ పని ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులను ఆలోచింపజేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలూ అందుకున్నాయి. జై భీమ్ మూవీలో హీరో చంద్రు ఏ విధంగా అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకొని ధైర్యం ఇస్తాడో, నిజ జీవితంలో రియల్ హీరో ఈ చంద్రుడు అంతకంటే ఎక్కువగా చేసి చూపించాడు.