Site icon NTV Telugu

ఆ ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేత కుదరదు.. స్పష్టం చేసిన వెంకయ్య

ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడిన సంగతి తెలిసిందే… ఇక, ఆ 12 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల్లో కూడా సస్పెండ్‌ చేస్తూ రాజ్యసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించడంతో.. ఒక్కసారిగా పొలిటిక్‌ హీట్‌ పెరిగింది… రాజ్యసభ సభ్యులు.. ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్‌ బోరా, రాజమణి పటేల్, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్, అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, డోలా సేన్, శాంతా చెత్రి, ప్రియాంక చతుర్వేది, అనిల్‌ దేశాయ్‌, ఎలమారమ్‌ కరీమ్‌, బినయ్‌ విశ్వంను శీతాకాల సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీర్మానం ప్రవేశపెట్టడం.. మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయాయి..

అయితే, ఈ వ్యవహారంపై ఇవాళ రాజ్యస‌భ‌లో చ‌ర్చ జరగగా.. ఆ 12 మంది ఎంపీల‌పై విధించిన స‌స్పెన్షన్ ఎత్తివేయాల‌ని కోరారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే.. వ‌ర్షాకాల స‌మావేశాల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఇప్పుడు ఎందుకు చ‌ర్యలు తీసుకున్నారంటూ ఆయన నిలదీశారు.. ఇక, దీనిపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంక‌య్యనాయుడు.. వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఎదురైన చేదు అనుభ‌వాలు ఇంకా వెంటాడుతున్నాయని వ్యాఖ్యానించారు.. సభలో అనుచితంగా ప్రవర్తిస్తూ ర‌భస సృష్టించిన ఎంపీల‌పై చ‌ర్యలు తీసుకునే హ‌క్కు చైర్మన్‌కు ఉందన్న ఆయన.. స‌స్పెన్షన్ ఎత్తివేత అభ్యర్ధన‌ను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు.. సస్పెన్షన్‌ ఎత్తివేత కుదరని స్పష్టం చేశారు.

Exit mobile version