NTV Telugu Site icon

అభిరుచి చాటుకున్న ‘యువచిత్ర’ మురారి

Producer K Murari Birth Day Special

(జూన్ 14న నిర్మాత కె.మురారి పుట్టినరోజు)
డాక్టర్ కాబోయి, యాక్టరయ్యానన్న మాట తరచూ చిత్రసీమలో వినిపిస్తూ ఉంటుంది. కానీ, డాక్టర్ చదువు మధ్యలో ఆపేసి, డైరెక్టర్ కావాలని చిత్రసీమలో అడుగుపెట్టి, తరువాత ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించారు ‘యువచిత్ర’ అధినేత కె.మురారి. ‘యువచిత్ర’ బ్యానర్ పేరు వినగానే ఆ పతాకంపై రూపొందిన పలు మ్యూజికల్ హిట్స్ మన మదిలో మెదలుతాయి. తొలి చిత్రం ‘సీతామాలక్ష్మి’ మొదలు చివరి సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ దాకా తమ ‘యువచిత్ర’ చిత్రాల్లో సంగీతానికే పెద్ద పీట వేశారు మురారి.

దిగ్దర్శకులతో…
దర్శకత్వంపై మోజుతో చిత్రసీమలో ప్రవేశించినా, తరువాత నిర్మాతగా మారాలనే నిర్ణయించారు మురారి. తన అభిరుచికి తగ్గ దర్శకుడు కె.విశ్వనాథ్ అని భావించి, ఆయనతో ‘సీతామాలక్ష్మి’ నిర్మించారు. బి.యన్.రెడ్డి ‘మల్లీశ్వరి’ చిత్రానికి సోషల్ వర్షన్ ఈ సినిమా అని తరువాతి రోజుల్లో ఆయనే చెప్పుకున్నారు. ‘సీతామాలక్ష్మి’ తరువాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘గోరింటాకు’ నిర్మించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. తరువాత వచ్చిన ‘జేగంటలు’ అంతగా అలరించలేకపోయింది. తరువాత దాసరి దర్శకత్వంలోనే శోభన్ బాబు హీరోగా ‘గోరింటాకు’ నిర్మించారు. అది మంచి విజయం సాధించింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురారి నిర్మించిన ‘త్రిశూలం’ కొన్ని ఏరియాల్లో విజయం సాధించింది, మరికొన్ని ప్రాంతాల్లో అలరించలేక పోయింది. అయితే మ్యూజికల్ హిట్ గా నిలచింది. దాసరి, శోభన్ తో మురారి తీసిన రెండో చిత్రం ‘అభిమన్యుడు’ అంతగా మురిపించలేక పోయింది. బాలకృష్ణ హీరోగా మురారి నిర్మించిన ‘సీతారామకళ్యాణం, నారీ నారీ నడుమ మురారి’ రెండు చిత్రాలూ ఘనవిజయం సాధించాయి. నాగార్జున హీరోగా ‘జానకిరాముడు’, వెంకటేశ్ కథానాయకునిగా ‘శ్రీనివాస కళ్యాణం’ నిర్మించారు మురారి. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా, ఇవి కూడా పాటలతో పరవశింపచేశాయి. జంధ్యాల దర్శకత్వంలో మురారి నిర్మించిన ‘సీతారామకళ్యాణం’, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఆయన తెరకెక్కించిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలు అనూహ్య విజయాన్ని మూటకట్టుకున్నాయి. మాస్ హీరోగా సాగుతున్న బాలకృష్ణతో ఒక్క ఫైట్ కూడా లేకుండా ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు మురారి.

మహదేవన్ అభిమాని…
మురారికి సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ అంటే ఎంతో అభిమానం. ఆయన సంగీత దర్శకత్వంలోనే అన్ని చిత్రాలనూ నిర్మించారు మురారి. ‘త్రిశూలం’ నిర్మించే సమయంలో రాఘవేంద్రరావు తనకు అచ్చివచ్చిన చక్రవర్తిని సంగీత దర్శకునిగా తీసుకుందామని మురారిని బలవంత పెట్టారట! అయినా మహదేవన్ బాణీల్లోనే సినిమా తీస్తాను, లేదంటే లేదని భీష్మించుకున్నారు మురారి. మహదేవన్ మరణం తరువాత ‘యువచిత్ర’ బ్యానర్ పై చిత్రాలనే నిర్మించలేదు మురారి. మామ అంటే మురారికి ఎంతటి అభిమానమో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.

1931 నుండి 2005 వరకు తెలుగు సినిమా రంగంలో నిర్మాతలుగా రాణించిన వారి గురించి ‘తెలుగు నిర్మాతల చరిత్ర’ పుస్తకాన్ని ప్రచురించారు. తరువాత తన స్వీయగాథగా రాసుకున్న ‘నవ్విపోదురు గాక’ పుస్తకంతో పలు వివాదాలకు కారకులయ్యారు. ఏది ఏమైనా అభిరుచి గల నిర్మాతగా నిలచిపోయారు మురారి.