Site icon NTV Telugu

ఫ్లెక్సీ వివాదంతో బయటపడ్డ వైసీపీలో విభేదాలు

కడప జిల్లాలో పండుగ వేళ ప్లెక్సీ వివాదం అధికార పార్టీ నేతల మధ్య గొడవలను బయటపెట్టింది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. అది కాస్త పోలీస్ కంప్లైంట్ల వరకు వెళ్లింది. భోగి మంట‌ల‌తో సంతోషంగా పండుగ‌ జ‌రుపుకోవాల్సిన స‌మ‌యంలో క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ప్లెక్సీ సెగలు పుట్టించింది. ఈనెల 16న జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ పుట్టిన రోజు కోసం ఆయ‌న అనుచరుడు దుగ్గిరెడ్డి రఘునాథరెడ్డి శ్రీ‌రాముల‌పేట‌లో ప్లెక్సీలు ఏర్పాటు చేయబోయారు. అయితే అందులో ఎమ్మెల్యే ఫోటోలేదని… వైసీపీ నాయకులు కసిరెడ్డి మహేష్ రెడ్డి అభ్యంతరం చెప్పాడు. దీంతో గొడవ మొదలైంది. రఘునాథరెడ్డిపై.. కసిరెడ్డి మహేష్ చేయిచేసుకోవడంతో గొడవ పెద్దదైంది.

https://ntvtelugu.com/ap-health-minister-allanani-humanity/

విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ అక్కడికి తన అనుచరులతో చేరుకున్నారు. ఇదే సంద‌ర్బంలో ప‌దోవార్డు కౌన్సిల‌ర్ గ‌రిశ‌పాటి ల‌క్ష్మిదేవి కూడా ఆమె కుటుంబ స‌భ్యుల‌తో అక్కడికి వచ్చారు. ఇరు వ‌ర్గాలు ఘర్షణకు దిగాయి. త‌న‌పై దాడి చేశారని ఎమ్మెల్సీ ర‌మేష్ వ‌ర్గీయుడు ర‌ఘునాధ‌రెడ్డి త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అటు త‌న‌ను దుర్బాష‌లాడి త‌న‌పై గ‌న్ను గురిపెట్టి చంపేస్తానంటూ బెదిరించాడ‌ని ఎమ్మెల్సీపై కౌన్సిల‌ర్ గ‌రిశ‌పాటి ల‌క్ష్మిదేవి వ‌న్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

ప్రొద్దుటూరు వైసీపీ నేతల మధ్య ఇన్నాళ్లుగా ఉన్న అంతర్గత విభేదాలు ఈ గొడవతో బయటపడ్డాయి. కొంతకాలంగా ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌కు, ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డికి మ‌ధ్య విబేధాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ ఒకే చోట క‌లిసి ఏ కార్యక్రమంలో క‌నిపించ‌డంలేదు. అస‌లు ప్రొద్దుటూరులో జ‌రిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో గానీ, పార్టీ కార్యక్రమాల్లో గానీ ఎమ్మెల్సీ ర‌మేష్ పాల్గొన‌డంలేదు. చివ‌ర‌కు సీఎం స‌భ‌లో కూడా ఎమ్మెల్సీకి అంతంత మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ప్లెక్సీల్లోనూ ప్రత్యర్థి వర్గాల ఫోటోలు వేయడం లేదు. పండుగ వేళ కూడా అలాగే జరగడంతో..మొదలైన గొడవ ఏకంగా ఫిర్యాదుల వరకు వెళ్లింది.

Exit mobile version