NTV Telugu Site icon

రివ్యూ: ప్రియురాలు మూవీ

Priyuralu Movie Review

కమెడియన్ సత్య హీరోగా సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ మూవీతో సోనీ లివ్ ఓటీటీ సంస్థ తెలుగు సినిమాలకు శ్రీకారం చుట్టింది. వినోద ప్రధానమైన ఆ చిత్రం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు యూత్ ను టార్గెట్ చేస్తూ, రొమాంటిక్‌ ఫీల్ గుడ్ ఎరోటిక్ మూవీ ‘ప్రియురాలు’ను 17వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేస్తోంది సోనీ లివ్‌. గతంలో శ్రీదివ్య నాయికగా ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’; నాగశౌర్య, నిహారిక జంటగా ‘ఒక మనసు’ చిత్రాలను రూపొందించిన రామరాజు ఈ ‘ప్రియురాలు’ చిత్రాన్ని తెరకెక్కించారు. అజయ్ కర్లపూడితో కలిసి ఆయనే ఈ సినిమాను నిర్మించారు కూడా!

ఓ ప్రముఖ ఛానెల్ లో పనిచేసే మాధవ్ (పృథ్వీ మేడవరం) కు, వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చిన దివ్య (మౌనిక)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం చివరకు లివ్ ఇన్ రిలేషన్ షిప్ కు దారితీస్తుంది. అయితే దివ్యతో ఫిజికల్ గా కలవడానికి ముందు తనకు ఆరు నెలల క్రితమే పెళ్ళి అయ్యిందనే విషయాన్ని మాధవ్ చెబుతాడు. అతనిలోని హానెస్టీ నచ్చి తన శరీరాన్ని మాధవ్ కు అప్పగిస్తుంది దివ్య. అదే సమయంలో వారుండే అపార్ట్ మెంట్ లోని వాచ్ మేన్ సత్యం (కౌశిక్ రెడ్డి) అక్కడకు వచ్చే పనిమనిషి సరిత (కామాక్షి భాస్కర్ల)తో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. కుటుంబ కట్టుబాట్లను చెరిపేసి లవ్ అండ్ లస్ట్ కు ప్రాధాన్యమిచ్చిన వీరి జీవితాలు ఎలాంటి కల్లోలాలకు గురి అయ్యాయి అన్నదే ‘ప్రియురాలు’ చిత్రం!

దర్శకుడు రామరాజు మీద ఓషో, చలం ప్రభావం చాలా ఉంది. వారిద్దరినీ కోట్ చేయకుండా ఆయన సినిమా పూర్తి కాదు. దర్శకత్వంతో పాటు కథ, మాటలూ ఆయనే సమకూర్చుకుంటారు. అయితే ఈ సినిమాకు మాత్రం శ్రీసౌమ్య కథ ఇచ్చినట్టు తెలుస్తోంది. తొలి రెండు సినిమాలలోనూ మహిళల మనోభావాలకు ప్రాధాన్యమిచ్చిన రామరాజు ఈ మూవీలోనూ అదే అంశాన్ని హైలైట్ చేశారు. శారీరక సంబంధం లేని ప్రేమ ప్రేమే కాదన్న వాదనను చూపించే ప్రయత్నం చేశారు. ప్రేమించిన దివ్య దగ్గర అబద్ధం ఆడకుండా ఉండ లేకపోయినా మాధవ్… అదే నిజాయితీని కట్టుకున్న భార్య దగ్గర ప్రదర్శించకపోవడంలోనే అతనికి ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉందనే విషయం అర్థమైపోతుంది. ఇక కూతురు పుట్టిన తర్వాత అతను నిదానంగా ప్రియురాలికి దూరం కావడమనే అంశాన్ని మరింత బలంగా చూపించి ఉండాల్సింది. వాచ్ మేన్ ఎక్ట్సామారిటల్ ఎఫైర్ కు బలమైన కారణం చూపకుండానే చాలా షాకింగ్ కన్ క్లూజన్ ను దర్శకుడు ఇచ్చాడు. ఇక చివరలో దివ్య తీసుకునే నిర్ణయం వెనుక ఆమె బాల్యం తాలుకూ సంఘటనల ప్రభావం ఉందని చూపడంతో ఆమె చర్యకు బలం ఏర్పడింది.

దర్శకుడు రామరాజు అంతిమంగా చెప్పాలనుకున్న విషయం మంచిదే అయినా… దానికి కేటాయించిన సమయం కంటే… హీరోహీరోయిన్ల శృంగారానికి, వాచ్ మేన్ సత్యం, సరిత మధ్య కామానికీ ఎక్కువ టైమ్ కేటాయించారు. విజువలైజేషన్ విషయంలో పెద్దంతగా శ్రుతి మించకపోయినా… ఓవర్ ఆల్ గా ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో కొంత ఇబ్బందికైతే గురిచేస్తాయి. ఓ రకంగా దర్శకుడు ప్రేమలోని గాఢతను చూపించాలనే తపనతో హద్దుల్ని దాటేశాడనిపిస్తుంది. ఎప్పటిలానే రామరాజు చిత్రాలలో ఉండే విజువల్ బ్యూటీ ఇందులోనూ ఉంది. సినిమాటోగ్రాఫర్ మహి పి రెడ్డికి ఇది మొదటి సినిమానే అయినా అనుభవం ఉన్న కెమెరామేన్ లా తన పనితనం చూపాడు. ఈ చిత్రంలో పాటలు… అప్పుడప్పుడు కాకుండా ఓ ప్రవాహంలా వచ్చేస్తుంటాయి. ప్రేమ, శృంగార సన్నివేశాలలో ఆ భావన కలగడం కోసం దర్శకుడు పాటలనే ఎంచుకున్నాడు. ఆ రకంగా కొన్ని సన్నివేశాలు దృశ్యకావ్యాలను తలపిస్తాయి. రామజోగయ్య శాస్త్రి, శ్రీవల్లి, పూర్ణాచారి, సిరాశ్రీ ఇందులోని పాటలను రాశారు. వాటిని సునీల్ కశ్యప్ వీనుల విందుగా స్వరపరిచాడు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. కాకపోతే… కొన్ని సన్నివేశాల్లో అది కాస్తంత లౌడ్ గా ఉంది. ఓవర్ ఆల్ గా సినిమా ప్రథమార్థం సాఫీగా సాగినా… ద్వితీయార్థంకు వచ్చే సరికీ కథ ముందుకు కదలడం లేదేమిటనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. పైగా ముగింపు ఎలా ఉంటుందనేది అందరి ఊహకూ తట్టేదే! ‘లవ్ ఈజ్ రొమాన్స్, లవ్ ఈజ్ హానెస్ట్, లవ్ ఈజ్ డైలమా’ అంటూ ఈ మూవీ ట్రైలర్ లో చూపిన కొన్ని ఎరోటిక్, లవ్ మేకింగ్ సీన్స్ యువత ఈ చిత్రాన్ని చూడటానికి పురికొల్పొతాయి. ఏ భావనతో అయితే… మూవీ చూడటానికి సిద్ధపడతారో అది ఫుల్ ఫిల్ అవుతుంది. కానీ దర్శకుడు రామరాజు గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ‘ప్రియురాలు’ను చూస్తే మాత్రం ఆయన గాడి తప్పారనే భావన కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే… ఇందులో నటించిన చాలామంది కొత్తవారే. పృథ్వీ మేడవరం, కౌశిక్ రెడ్డి, మౌనిక, కామాక్షి తమ పాత్రలను చక్కగా పోషించారు. ఇతర పాత్రల్లో శ్రావ్య దువ్వూరి, వర్ష, కృష్ణంరాజు, జోగినాయుడు, జర్నలిస్ట్ కుమార్ తదితరులు కనిపిస్తారు. వారి నుండి దర్శకుడు చక్కని నటనను రాబ్టటుకున్నాడు. థియేటర్లలో విడుదలై ఉంటే… ఈ సినిమాకు ప్రతికూలత ఎదురయ్యేది. అయితే.. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి… రొమాంటిక్, ఎరోటిక్ లవ్ స్టోరీస్ ను ఇష్టపడే వారు ఓసారి చూడొచ్చు.

ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటన
మహి సినిమాటోగ్రఫీ
సునీల్ కశ్యప్ సంగీతం

మైనెస్ పాయింట్స్
మితిమీరిన శృంగార సన్నివేశాలు
సహనానికి పరీక్ష పెట్టే ద్వితీయార్థం

రేటింగ్: 2.25 / 5

ట్యాగ్ లైన్: ‘ప్రియురాలు’ పిలిచె!

Show comments