తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్థిల్తుతోంది. ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా గంజాయిని అక్రమరవాణా చేస్తూ కేటుగాళ్ళు పట్టుబడుతున్నారు. సంగారెడ్డిలో ప్రొహిబీషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కంది, చేర్యాల గ్రామం ,రుద్రారం,భానూరు, వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయి లభ్యం అయింది. చేర్యాల గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి , భానూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల నుండి 85డబ్బాల్లో, 425 గ్రాముల ఆశిష్ ఆయిల్, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1,70,000 అని అధికారులు తెలిపారు.
బీదర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కర్ణాటక బస్సును ఆపి తనిఖీ చేయగా గంజాయిని రవాణా చేస్తున్న రుద్రారం గ్రామానికి చెందిన మధుకర్ పట్టుబడ్డాడు. అతని నుండి 18 పాకెట్స్ గల 90 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3600. ఈ ముగ్గురు నిందితులను కోర్టుముందు హాజరు పరిచారు పోలీసులు. విచారణలో అనేక విద్యాలయాల్లో మత్తు పదార్థాలు వాడుతున్నట్లు బయట పడింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు ఎక్సైజ్ శాఖ పోలీసులు.
ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ గంజాయి గుప్పుమంటోంది. ఛత్తీస్ గడ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారు. MP 09 HH 3684 లారీలో తరలిస్తున్న 34 బ్యాగుల 825కేజీల గంజాయిని సీజ్ చేశారు. సుమారు 1కోటి65లక్షల విలువగల గంజాయిని పట్టుకున్నారు చుంచుపల్లి పోలీసులు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు జిల్లా ఎస్పీ సునీల్ దత్.
