NTV Telugu Site icon

ఒకే రోజు రెండు సినిమాలు… ఓ ప్రత్యేకత!

ఒకే రోజున ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలయితే అది అభిమానులకు పెద్ద విశేషమే! అలాగే ఒకే రోజున ఒకే హీరోయిన్ నటించిన రెండు సినిమాలు కూడా పలుమార్లు విడుదలయ్యాయి. వాటినీ ముచ్చటించుకున్నాం. కానీ, ఒకే రోజున ఒకే దర్శకుని రెండు చిత్రాలు విడుదల కావడం వాటిలోనూ కొన్ని విశేషాలు చోటు చేసుకోవడం మరింత విశేషమే కదా! సరిగ్గా 35 సంవత్సరాల క్రితం అంటే 1986 అక్టోబర్ 2వ తేదీన ఆ ముచ్చట జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి ఆ రోజుల్లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ఒకే రోజున జనం ముందు నిలిచాయి. వాటిలో ఒకటి చిరంజీవితో కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ‘రాక్షసుడు’, రెండోది కమల్ హాసన్ తో అదే కోదండరామిరెడ్డి రూపొందించిన ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’. ఈ మూవీస్ రెండూ 1986 అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకలుగా వచ్చాయి. రెండూ అలరించాయి.

ఈ రెండు సినిమాల్లో మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ రెండు నవలా చిత్రాలు కావడం మరో విశేషం. ఆ రెండింటినీ రాసినది యండమూరి వీరేంద్రనాథ్. అదీగాక ఈ రెండు సినిమాలకు ఇళయరాజా సంగీతం సమకూర్చడం మరింత విశేషం! ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’లో కమల్ హాసన్ హీరోగా నటిస్తే, ‘రాక్షసుడు’లో ఆయన అన్న కూతురు సుహాసిని నాయికగా నటించారు. ఇక ‘రాక్షసుడు’ చిత్రం ద్వారా చిరంజీవి పెద్ద తమ్ముడు నాగేంద్రబాబు సినిమారంగానికి పరిచయమయ్యారు. తెలుగునాట ‘రాక్షసుడు’ మంచి విజయం సాధించింది. శ్రీదేవి నాయికగా రూపొందిన ‘ఒకరాధ ఇద్దరు కృష్ణులు’ కూడా విజయపథంలో పయనించింది. ఈ రెండు చిత్రాలు తమిళంలోకి డబ్ కావడం అక్కడ ఇళయరాజా బాణీలతో జనాన్ని అలరించడం జరిగాయి.