మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. నల్లధనం కట్టడి చేయడం కోసం అంటూ 2016, నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2వేలు, రూ.100, రూ.200, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తీసుకువచ్చింది. కానీ ఐదేళ్లు గడిచినా నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెటిజన్లు మోదీ సర్కార్ వైఫల్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజును బ్లాక్ డే అంటూ వాళ్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి 2016, నవంబర్ 8 పునాది అంటూ విమర్శలు చేస్తున్నారు.
కాగా 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో ఆర్థిక గణాంకాల ప్రకారం మన దేశంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.17.74 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ.29.17 లక్షల కోట్లకు చేరింది. కరోనా వల్ల ప్రజలు సేవింగ్స్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో కరెన్సీ నోట్ల చలామణి బాగా పెరిగిందని ఆర్‌బీఐ వాదిస్తోంది. అయితే గత ఐదేళ్ల సమయంలో దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీ స్థాయిలో పెరిగాయి.
