NTV Telugu Site icon

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోకి వారికి నో ఎంట్రీ..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధించినట్టు వెల్లడించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ.. ఈ మేరకు మెమో జారీ చేశారు… కాగా, అనధికార వ్యక్తుల ప్రమేయం వల్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్స్ వల్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని తన నివేదికలో పేర్కొంది ఏసీబీ.. తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు డాక్యుమెంట్ రైటర్లు.. స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని తెలిపింది..

Read Also: పసిడి ధర ఇవాళ ఇలా..

ఇక, ఏసీబీ అబ్జర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ.. అందుకే అనధికారిక వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.. అయితే, ఐజీ ఆదేశాలపై డాక్యుమెంట్ రైటర్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తం డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థనే అవినీతి వ్యవస్థగా చిత్రీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఫేక్‌గాళ్లు రెచ్చిపోయి అవినీతిలో కొత్తదారులు తొక్కుతూ.. రాష్ట్ర ఖజానాకు కోట్లలో గండి కొట్టిన సంగతి తెలిసిందే.. నకిలీ చలాన్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద స్కామ్‌లు వెలుగుచూశాయి.. అన్ని జిల్లాల్లోనూ స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ తనిఖీలు చేపట్టడంతో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు కోసం చెల్లించే చలానాలను కొందరు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకుల్లో చలానా తీసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమర్పించాక.. కొందరు అవే చలానాలను మళ్లీ వినియోగిస్తున్నారని దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే.