NTV Telugu Site icon

పెగాసిస్‌ వివాదంలో అనూహ్య పరిణామం..

కొద్ది రోజుల క్రితం పెగాసిస్‌ స్పైవేర్‌ యావత్‌ దేశాన్ని కుదిపేసింది. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. భారత్ పార్లమెంట్‌ని తీవ్రంగా కుదిపేసిన పెగాసిస్‌ అంశం ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఈ వివాదం మరోసారి మీడియా హెడ్‌లైన్లలో నిలిచింది.

దేశ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన పెగాసిస్‌ ఎపిసోడ్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఒక అనూహ్య పరిణామం. ఈ స్పైవేర్‌ని పౌరులపై ప్రయోగించలేదని కేంద్రం వాదిస్తోంది. ఐతే, కేంద్రం చెపుతున్న దానిలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఎక్స్‌పర్ట్స్‌ కమిటీని నియమించింది. ఇది మోడీ ప్రుభుత్వానికి షాక్‌ లాంటిది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలిస్తుంది.

ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ పనితీరును కోర్టు స్వయంగా పర్యవేక్షించనుంది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి వుంటుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి, జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ ఈ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీకి నేతృత్వం వహిస్తారు. తీర్పు సందర్భంలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రత అని చెప్పినంత మాత్రాన సుప్రీంకోర్టు చూస్తూ కూర్చోదని, జాతీయ భద్రతా కారణాల రీత్యా వివరాలు వెల్లడించలేం అన్న వాదనను కేంద్ర ప్రభుత్వం రుజువు చేసుకోవాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మనం సాంకేతిక శకంలో జీవిస్తున్నాం. టెక్నాలజీ ఎంత ముఖ్యమో.. వ్యక్తలు గోప్యతను కాపాడుకోవడం కూడా అంతే ప్రధానమంది సర్వోన్నత న్యాయస్తానం. పిటిషనర్లు చేసిన ఆరోపణలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించినవి. వాటికి భంగం కలిగితే కోర్టు చూస్తూ ఊరుకోదని సుప్రీం కోర్టు తెలిపింది.

గత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అది తీవ్ర దుమారం రేపటంతో పార్లమెంట్‌ సెషన్స్‌ ఒక్క రోజు కూడా సవ్యంగా సాగలేదు. హోం మంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుపట్టాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై నిఘా పెట్టడంతో పాటు సొంత మంత్రుల పైనే గూఢచర్యం చేయటంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. హోంమంత్రి అమిత్ షాను తప్ప దీనికి వేరే ఎవరినీ బాధ్యులుగా చేయలేమని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వాదించింది. ప్రధాన మంత్రి ఆమోదం లేకుండా ఇది జరిగి ఉండదని విపక్ష నేతలు అన్నారు. దీనిపై చర్చ చేపట్టాలని, దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

పెగాసిస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందో, లేదో ప్రభుత్వం చెప్పాలన్నది విపక్షాల డిమాండ్‌. అయితే కేంద్రం దీనిపై నోరు విప్పలేదు. విపక్షాల ఆరోపణలు ఉత్తివేనంటూ కొట్టిపారేస్తోంది. ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పెగాసస్ స్పైవేర్ పై తీవ్ర చర్చి జరిగింది. అనేక దేశాలు దీనిపై విచారణకు అదేశించాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఆ పని చేయకపోవటాన్ని తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది.

పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్ కంపెనీ NSO గ్రూప్‌కు చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారన్నది ఆరోపణ. పెగాసస్‌ టార్గెట్‌ చేసిన వారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహా వివద రంగాలకు చెందిన వందలాది మంది ఈ జాబితాలో ఉన్నారు. దీంతో ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పెగాసిస్‌పై గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపి కేంద్రం స్పందన కోరింది. అయితే దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారంలో తాము సవివరంగా అఫిడవిట్‌ దాఖలు చేయట్లేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది.

NSO గ్రూప్ పెగాసిస్‌ స్పైవేర్‌ని వివిధ దేశాల ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది. నేరస్థులు, తీవ్రవాదులను ట్రాక్ చేసే ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌ రూపొందించామని ఆ సంస్థ చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 45 దేశాల నుంచి 50వేల ఫోన్ నంబర్ల డేటా లీకైంది. పారిస్‌లోని ఫర్‌బిడెన్ స్టోరీస్ మీడియా సంస్థ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ చేతికి ఆ వివరాలు చిక్కాయి. ఈ రెండు సంస్థలు ప్రపంచంలోని 16 మీడియా సంస్థలతో కలిసి ఈ డేటా బేస్ నంబర్లపై పరిశోధన చేయించాయి. ఈ పరిశోధనకు పెట్టిన పేరు పెగాసస్ ప్రాజెక్ట్. NSO క్లయింట్స్‌ ఈ 50 వేల నంబర్లను పెగాసిస్ సిస్టమ్‌కు అందించినట్లు చెబుతున్నారు.

ఐతే, లీకయిన డేటాలోని అన్ని నంబర్లనూ పెగాసస్‌ హ్యాక్ చేసిందా లేదా అన్నది తెలియదు. ఫోరెన్సిక్ పరిశోధన తర్వాతే ఆ విషయం తెలుస్తుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, తన టెక్ లాబ్‌లో 67 డివైస్‌లకు ఫోరెన్సిక్ పరీక్షలు చేసింది. అందులో 37 డివైస్‌లు పెగాసెస్‌కు టార్గెట్ అయ్యాయని గుర్తించింది. వాటిలో పది డివైస్‌లు భారత్‌కు చెందినవి.

ఎంతోమంది జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు ఈ నిఘా బారినపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని దీని ద్వారా స్పష్టమవుతోంది. పెగాసెస్ స్పైవేర్‌ను వీటిపై ఆయుధంలా ఉపయోగించారు. ఐతే, లీకయిన వేల నంబర్ల జాబితాకు తమకు ఎలాంటి సంబంధం లేదని NSO అంటోంది. తమ సాఫ్ట్‌వేర్‌ను 40 దేశాల సైన్యాలకు, ప్రభుత్వ సంస్థలకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మాత్రమే విక్రయించామని ఆ కంపెనీ చెప్పింది. ఐతే, ఆ 40 దేశాల పేర్లు మాత్రం చెప్పలేదు.

పెగాసిస్‌ స్పైవేర్‌ని భారత్‌కు నికి విక్రయించినట్లు NSO ధ్రువీకరించలేదు..అలాగని తిరస్కరించనూ లేదు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన తాజా కమిటీ దర్యాప్తులో నిజా నిజాలు తెలుస్తాయి. ఈ కేసు విచారణను కోర్టు ఎనిమిది వారాల పాటు వాయిదా వేసింది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే!!