NTV Telugu Site icon

Navaratri 2023 : పెద్దమ్మ తల్లి గుడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఈరోజు ఏ రూపంలో దర్శనమిస్తారంటే?

Peddamma Thalli

Peddamma Thalli

దేవిశరన్నవరాత్రి, దసరా ఉత్సవాలకు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయం ముస్తాభైంది. ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రులు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలకు 10లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఆధికారులు తెలిపారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేశామని, క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించనున్నామన్నారు..

ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు.. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరాదేవి అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు.. ఈ అలంకరణ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం.హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి..

బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు.బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం. ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.. ఈరోజు అమ్మవారు ఈ అలంకరణలో దర్శనం ఇస్తున్నారు.. ఉదయం 3 గంటలకు అమ్మవారిని నిద్రలేపి అభిషేకాలు జరిపించునున్నారు..అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఉదయం 6 గంటల నుంచి ఆలయానికి తరలి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు నవరాత్రి సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. అమ్మవారి దర్శనం కోసం వస్తున్న వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు..