NTV Telugu Site icon

చెరకు రైతులపై ప్రభుత్వం దాడి చేయించడం దారుణం : నారా లోకేష్‌

విజయనగరం జిల్లాలోని ఎన్‌సీఎస్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీ ముందు రైతులు తమకు రావాల్సి బకాయిల కోసం నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనను విరమింపజేయడానికి ప్రయత్నించడంతో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. ప్రజ‌లైనా, ప్రతి ప‌క్షమైనా, చివ‌రికి అన్నదాత‌లనైనా ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోందని అన్నారు.

Read Also : ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ 400 సంవత్సరాల గణపతి విగ్రహం

అంతేకాకుండా చెరకు రైతులపై ప్రభుత్వం దాడి చేయించడం దారుణమని, ఎన్‌సీఎస్‌ షుగర్స్ యాజ‌మాన్యం రెండు క్రషింగ్ సీజన్లకు రూ.16.33 కోట్లు బ‌కాయిలు త‌క్షణ‌మే చెల్లించాల‌ని ధర్నాకు దిగిన చెరకు రైతులపై దౌర్జన్యం సరికాదని అన్నారు. మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్రవ‌ర్తించ‌డం.. స‌భ్యస‌మాజం త‌ల‌దించుకునే విధంగా ఉందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

త‌మ‌కు న్యాయంగా రావాల్సిన బ‌కాయిలు అడిగితే దాష్టీకానికి పాల్పడ‌టం చాలా అన్యాయమని, త‌క్షణ‌మే చెర‌కు రైతుల బ‌కాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మ‌హిళ‌లు, రైతుల‌పై దాడిచేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలని, చెర‌కు రైతుల న్యాయ‌మైన పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మ‌ద్దతుగా నిలుస్తుందని లోకేశ్‌ వెల్లడించారు.