(ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా)
పండిత పామరులనే కాదు యువతరాన్ని సైతం తన సుస్వరాలతో అలరింపచేయడం కీరవాణికి వెన్నతో పెట్టిన విద్య. వీనుల విందైన రాగాన్నే పేరుగా పెట్టుకుని పెరిగిన కీరవాణిపై ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్త పెట్టుకున్న అంచనాలు ఇసుమంతైనా తప్పలేదు. ఇవాళ సంగీత జలధి మరకత మణి కీరవాణి జన్మదినం. 1961 జూలై 4న ఆయన జన్మించారు. సంగీతమంటే ప్రాణం పెట్టే శివశక్తి దత్త తనకిష్టమైన కీరవాణి రాగాన్నే కొడుక్కి పేరుగా పెట్టారు. అందుకేనేమో స్వర రచన, గీతాలాపనతో కీరవాణి జీవితం ముడిపడిపోయింది.
ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి, ఇళయరాజా వద్ద పనిచేసిన కీరవాణికి తొలి అవకాశం ఇచ్చింది రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ రాజు. ‘కల్కి’ చిత్రానికి తొలుత కీరవాణి సంగీతం సమకూర్చినా, ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘మనసు మమత’ చిత్రం ముందుగా విడుదలైంది. చిత్రం ఏమంటే… కెరీర్ ప్రారంభంలోనే కీరవాణికి తన సత్తా చాటే గొప్ప అవకాశం లభించింది. ‘శివ’ చిత్రం తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘క్షణక్షణం’కి, అదే సమయంలో క్రాంతికుమార్ రూపొందించిన ‘సీతారామయ్య గారి మనవరాలు’ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. మోడ్రర్న్ ట్రెండ్ కు తగ్గట్టుగా వర్మ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చి కుర్రకారుని తనవైపు తిప్పుకున్న కీరవాణి, ఏయన్నార్ చిత్రానికి సంప్రదాయబద్ధమైన స్వరాలు సమకూర్చి సంగీత ప్రియుల మనుసుల్ని దోచుకున్నారు. ఇక ఆ తర్వాత సంవత్సరంలో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ తో స్టార్ హీరోల అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నారు. చిరంజీవి ‘ఘరానా మొగుడు’, వెంకటేశ్ ‘సుందరకాండ’, నాగార్జున ‘అల్లరి మొగుడు’తో కీరవాణి టీజింగ్ సాంగ్స్, రొమాంటిగ్ సాంగ్స్, మాస్ బీట్ సాంగ్స్ కూ న్యాయం చేస్తాడనే పేరొచ్చేసింది. ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూసుకునే అవసరమే పడలేదు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కీరవాణి అనుబంధం ప్రత్యేకమైంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ కు లెక్కలేదు. ‘అల్లరి ప్రియుడు’ వంటి సినిమాలో కీరవాణి బాణీలకు రాజశేఖర్ తో స్టెప్పులేయించారు రాఘవేంద్రరావు. అలానే వీరి కాంబినేషన్ లోనే వచ్చిన ‘పెళ్ళిసందడి’ సైతం పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ విజయంలో కీరవాణి ప్రాతినిధ్యమే ఎక్కువ. సంగీత దర్శకుడిగా కీరవాణి సత్తా తెలిసిన వాడిగా రాఘవేంద్రరావు ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ‘అన్నమయ్య’ చిత్రాన్ని కీరవాణి చేతిలో రాఘవేంద్రరావు పెట్టడం నిజంగా గొప్ప విషయం. అదే సమయంలో తన ప్రాణాలు పెట్టి మరీ కీరవాణి దానికి స్వరరచన చేశారు. ఆయన గత చిత్రాలు ఒక ఎత్తు… ‘అన్నమయ్య’ మరో ఎత్తు. అందుకే ఆ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగానూ అవార్డును అందుకోగలిగారు. ఆ తర్వాత కూడా ‘శ్రీరామదాసు, వెంగమాంబ, షిర్డి సాయి, పాండురంగడు, ఓం నమో వేంకటేశాయ’ వంటి పౌరాణిక, చారిత్రక చిత్రాలకూ ఆయన అద్భుతమైన స్వరాలు అందించారు.
కీరవాణి సంగీత ప్రయాణంలో మూడు తరాల కథానాయకులతో పనిచేయడం మరో విశేషం. మహానటుడు ఎన్టీయార్ ‘మేజర్ చంద్రకాంత్’కు సంగీతం సమకూర్చిన కీరవాణి, నందమూరి హరికృష్ణ కథానాయకుడిగా నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాకూ, ఆయన కొడుకు జూనియర్ ఎన్టీయార్ నటించిన పలు చిత్రాలకు సంగీతం అందించారు. అలానే అక్కినేని నాగేశ్వరరావుకు, ఆయన కుమారుడు నాగార్జునకు, ఆయన కుమారుడు నాగ చైతన్య చిత్రానికీ కీరవాణి స్వర రచన చేశారు. బహుశా ఆయన తరం సంగీత దర్శకులలో కూడా ఇలా సినీరంగంలోని రెండు ప్రముఖ కుటుంబాలకు చెందిన మూడు తరాల వారికి సంగీతం అందించిన ఖ్యాతి మరెవరికీ దక్కలేదేమో! అలానే ఎన్టీయార్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘ఎన్టీయార్ కథానాయకుడు, ఎన్టీయార్ మహానాయకుడు’ చిత్రాలకు కీరవాణి స్వరపరిచిన పాటలు అన్నగారి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఎస్.ఎస్. రాజమౌళితోనూ కీరవాణి సాగిస్తున్న అప్రతిహత ప్రయాణం చెప్పుకోదగ్గది. అన్నయ్యను కాదని రాజమౌళి పక్కకు వెళ్ళరు. తమ్ముడి చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేయకుండా కీరవాణి నిద్రపోరు. అందుకే కీరవాణికి ఇంతవరకూ లభించిన అవార్డులలో రాజమౌళి చిత్రాలే అధికంగా ఉంటాయి. ‘రాజేశ్వరి కళ్యాణం’ సినిమాతో 1992లో తొలిసారి సంగీత దర్శకునిగా కీరవాణి నందిని అందుకున్నారు. ఆ తర్వాతి సంవత్సరమే ‘అల్లరి ప్రియుడు’తో మరో నంది వారి ఇంటికి వచ్చింది. ముచ్చటగా మూడో నందిని ‘పెళ్ళిసందడి’ తీసుకురాగా, ఆ తర్వాత ‘వెంగమాంబ, ఒకటో నంబర్ కుర్రాడు, ఛత్రపతి, ఈగ, బాహుబలి’ చిత్రాలకు నందులను అందుకున్నారు కీరవాణి. ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరిలో ఇంతవరకూ అత్యధికంగా ఎనిమిది అవార్డులు అందుకున్న ఘనత కీరవాణికే దక్కుతుంది. అలానే రాజమౌళి దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ నంబర్ 1, మర్యాద రామన్న, బాహుబలి’ చిత్రాలకు గానూ మూడు సార్లు ఉత్తమ గాయకుడిగానూ నందుల్ని పొందారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలకూ కీరవాణి స్వరాలు అందించారు.
కొంతకాలంగా సంగీత దర్శకుడిగా విరామం తీసుకుంటానని, ఇకపై సినిమాలు చేయనని కీరవాణి అంటున్నా… ఆయనను అభిమానించే దర్శక నిర్మాతలు ఆయన్ని వదిలి పెట్టడం లేదు. ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’కు, క్రిష్ దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాకు, కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న ‘పెళ్ళిసందడి’ చిత్రానికి కీరవాణి స్వర రచన చేస్తున్నారు. కీరవాణి సతీమణి శ్రీవల్లి నిర్మాతగా రాణిస్తుంటే… వారి కుమారులు కాలభైరవ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఇప్పుడిప్పుడే తన సత్తా చాటుతున్నాడు. ఇక మరో కుమారుడు శ్రీసింహ నటుడిగా తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు.
సినిమా రంగానికే అంకితమైపోయిన ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో అత్యంత కీలకమైన వ్యక్తి కీరవాణి. తన ముందు తరానికి, తన తరానికి, తన తర్వాత తరానికి సైతం తలలో నాలుకలా వ్యవహించే కీరవాణి మరిన్ని వసంతాలు ఆయురారోగ్యాలతో సంగీత ప్రియలు మెచ్చే స్వరాలను అందించాలని కోరుకుంటూ, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం.
