ఈమధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఎమ్మెల్యే ఎవరైనా వున్నారంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తప్ప మరెవరూ కాదనే చెప్పాలి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవరని, ఆయన గెలిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈటల గెలవడంతో బాలరాజు పరిస్థితి ఘోరంగా మారింది. అన్నా ఎప్పుడు రాజీనామా చేస్తావంటూ బీజేపీ, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బాలరాజుపై వత్తిడి తేవడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు ఎమ్మెల్యే బాలరాజు. పోలీసులను ఏంట్రా అనడంతో రచ్చ లేచింది. సీఎం కేసీఆర్ ఆదివారం మహబూబ్ నగర్ చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దినకర్మకు సందర్భంగా ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం.. శాంతమ్మ సమాధి వద్ద ఆమెకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని సీఎం కేసీఆర్ పరామర్శించారు.
అయితే శాంతమ్మ సమాధి వద్దకు వెళ్లేందుకు కేవలం వాహనం అనుమతి సి.యం కేసీఆర్ కు మాత్రమే ఉంది. మిగిలిన యం.ఎల్.ఏ లు..మంత్రులు ఎవరైనా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసి సమాధి వద్దకు నడుచుకుంటూ పోవాలి. అందరూ నిబంధనలు ప్రకారమే నడుచుకున్నారు. కానీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాత్రం తన వాహనాన్ని సమాధి వరకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు.
READ ALSO బాలరాజు బాధ ఇంతింతకాదయా!
పోలీసులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాం అంతే.. అని మర్యాదపూర్వకంగా చెప్పడంతో గువ్వల బాలరాజు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కాసేపటికే పోలీసు అధికారులను ఏంట్రా అని నోరు జారారు. అంతే పోలీసు అధికారులు యం.ఎల్.ఏ బాలరాజుకు ఏంట్రా అంటారా మీరు అధికారులకు ఇచ్చే విలువ ఇదేనా? అంటూ చుక్కలు చూపించారు.
తర్వాత బాలరాజు చేసేది ఏమీ లేక తన అనుచరులతో కాలి నడకన సమాధి వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. ఆయన్ని చాలాసేపు నిలదీశారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. ఎమ్మెల్యే గారూ కొంచెం ఓపిక పట్టండి.. మీ అనుచరులను అన్నట్లు ప్రజలను,అధికారులను అంటే ఎవరూ ఒప్పుకోరు…చుక్కలు చూపిస్తారంటూ మళ్ళీ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. పాపం బాలరాజు!
