Site icon NTV Telugu

మహాత్ముడి జయంతి.. అహింసే ఆయన మార్గం..

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ… ఆయనే మహాత్మా గాంధీ.. 1869 అక్టోబర్‌ 2న గుజరాత్‌లోని పోర్ బందర్‌లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించిన ఆయన.. జాతిపితగా అందరూ గౌరవించే స్థానానికి ఎదిగారంటే.. ఆయన నమ్మిన సత్యం, అహింస సిద్ధాంతాలు.. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం లాంటి ఆయుధాలు.. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే నంటూ ఆయన వేసిన అడుగులే కారణం.. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా ఆ మహాత్ముడిని కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారంటూ.. ఎప్పటికీ ఆయన అందరి గుండెల్లో నిలిచిపోయే జాతిపిత. ఇవాళ ఆయన 152వ జయంతి సందర్భంగా ఓసారి మళ్లీ ఆయనను స్మరించుకుందాం..

గుజరాత్ లో ఓ సామాన్య మానవునిగా పుట్టిన గాంధీజీ.. తెల్లదొరలను శాంతి, అహింస అనే ఆయుధాలతో తరిమి కొట్టేందుకు అనేక రూపాల్లో పోరాటాలు చేశారు… కానీ, ఎప్పుడు తాను నమ్మిన సత్యం, అహింస సిద్ధాంతాలను మాత్రం వీడలేదు.. యావత్ భారతావని అంతా అతని శాంతియుత పోరాటానికి మద్దతు పలికింది. కోట్లాది మంది జనాలు ఆయన వెంట నడిచారు.. చివరకు ఆయన ప్రపంచానికే ఆదర్శమూర్తి అయ్యారు.. ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు ఆయన.. ఆ అస్త్రాలను పరిచయం చేయడమే కాదు, వాటిని ఉపయోగించడానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. చేత కర్రబట్టి.. ఆ కర్రను యుద్ధానికి ఉపయోగించకుండానే.. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించినా, మగ్గం చేతబట్టి నూలు వడికినా, చీపురు అందుకొని మురికివాడలు శుభ్రం చేసినా ఆయనకే చెల్లింది.. ఒక్కడుగా మొదలై కోట్లాది మందిని ఏకతాటిపైకి తీకొస్తూ ముందుకు కదిలిన ఆయన.. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేశారు..

ఇక, గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2న.. కరంచంద్ గాంధీ, పుత్లీ బాయిదంపతులకు జన్మించారు.. గాంధీజీ మొదట్లో చదువులో అంతగా చురుకైన విద్యార్థి కాదు.. ఈ విషయాన్ని ఆయనే తన ఆత్మకథ ‘My Experiments With Truth’లో స్వయంగా రాసుకొచ్చారు.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు.. క్లాస్‌ రూమ్‌లో ఎక్కువ బియడంతో వెనుక వరసలో కూర్చొనే ఆయన.. ప్రాథమిక విద్య రాజ్‌కోట్‌లో, ఉన్నత విద్య కథియవాడ్‌లో పూర్తి చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా వెళ్లారు.. అక్కడే ఆయన పోరాటం ప్రారంభమైంది.. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చి దేశాన్నంతటినీ ఏకదాటిపైకి తెచ్చి స్వాతంత్య్రం సంపాదించి పెట్టడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనది.. భారత్‌పై చెరగని ముద్ర వేసి.. జాతిపిత అయ్యారు. ఇక, 1947, అక్టోబర్‌ 2 స్వతంత్ర భారతంలో గాంధీజీ తొలి, ఆఖరు (78వ) పుట్టినరోజు.. ఢిల్లీలో జరిగిన ప్రార్థన సమావేశంలో మహాత్ముడు ఉద్వేగంతో మాట్లాడుతూ.. ఉపవాసం… నూలు వడకటం… ప్రార్థన… పుట్టినరోజు జరుపుకొనే సరైన పద్ధతి ఇదేనన్నది నా భావన.. మీ అందరికీ ఇవాళ నా పుట్టినరోజు. నాకు మాత్రం సంతాప దినం! ఇంకా బతికున్నందుకు ఆశ్చర్యంగానూ, సిగ్గుగానూ ఉంది. ఇన్నాళ్లూ లక్షల మంది నా మాట మీద నడిచారు.. ఇవాళ ఒక్కరూ నా మాట వినటం లేదు. నిజంగా నా పుట్టిన రోజు సంబరంగా చేసుకోవాలనే మీకుంటే… మనసుల్లోంచి విద్వేషభావాన్ని తొలగించుకోండి.. అంటూ ఆయన కుండబద్ధలు కొట్టినట్టుగా తన అభిప్రాయాన్ని చెప్పెశారు.. కానీ, 1948 జనవరి 30న అత్యంత దారుణంగా ఆయన హత్యకు గురికావాల్సి వచ్చింది.. నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి మహాత్ముడిని కాల్చి చంపాడు. ఇవాళ ఆ మహాత్ముడి జయంతి సందర్భంగా ఓసారి ఆయను స్మరించుకోవడమే కాదు.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం.

Exit mobile version