NTV Telugu Site icon

తిరుమలలో చిరుత కలకలం.. సైరన్ మోగించిన సిబ్బంది

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కరోనా కారణంగా గతంలో భక్తులు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరుగుతున్నారు. తాజాగా తిరుమలలో కలకలం రేగింది. రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో అలజడి కలిగింది. ఘాట్ రోడ్డులోని ఆఖరి మలుపు వద్ద చిరుత సంచరించింది.

ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ముగించుకుని తిరుమలకు వస్తున్న కార్మికులకు కనపడింది చిరుత. దానిని చూసి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు కార్మికులు. వెంటనే ఘటన స్థలంకు చేరుకొని సైరన్ తో శబ్ధాలు మోగించారు విజిలెన్స్ సిబ్బంది. దీంతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. దీంతో బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు కార్మికులు.

అంతకుముందు ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఘాట్ రోడ్డులో 7,8,9వ కిలోమీటర్ వద్ద మరమ్మతు పనులు పూర్తిఅయినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 14,15వ కిలో మీటర్ వద్ద కొనసాగుతున్నాయి మరమ్మతు పనులు. భవిష్యత్తులో కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నెల రోజుల్లో మరమ్మతు పనులు పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.