NTV Telugu Site icon

అలరించిన జె.వి.రాఘవులు సంగీతం…

Legendary Music Director JV Raghavulu Birth Anniversary

(జూన్ 7న సంగీత దర్శకులు జె.వి.రాఘవులు వర్ధంతి)
ప్రముఖ సంగీత దర్శకులు జె.వి.రాఘవులు పుట్టినతేదీ ఏ రోజో తెలియదు. కానీ, తాను పుట్టింది ఎందుకో అన్న అంశం మాత్రం రాఘవులుకు బాగా తెలుసు. బాల్యంలోనే ‘హరిశ్చంద్ర’ నాటకంలో లోహితాస్యునిగా నటించి రాగయుక్తంగా పాడి మెప్పించేవారు. నాటకాలన్నా, నటనన్నా ఎంతో ప్రీతి. దాంతో రాఘవులు అంతగా చదువుకోలేక పోయారు. పదోతరగతి దాకా చదివినా, పురాణాలపై మంచి పట్టు ఉండేది రాఘవులుకు. ఆయన గురువులు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి పాటలు పాడమని ప్రోత్సహించేవారు. వారి ప్రోత్సాహంతోనే ఓ సారి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ , విజయవాడలో ‘గీతావళి’ ప్రోగ్రామ్ లో రాఘవులు పలు పాటలు పాడారు. వాటిలో ఒకటి ఘంటసాల మాస్టారు చెవిన పడింది. ఆయన విజయవాడ వచ్చినప్పుడు రాఘవులును సినిమా రంగానికి ఆహ్వానించారు. ఇంట్లో చెప్పాపెట్టకుండా మద్రాసు వెళ్ళి అక్కడ ఘంటసాల మాస్టారు శిష్యునిగా చేరిపోయారు రాఘవులు. తన దరికి చేరిన వారిని ఆదరించడంలో ఘంటసాల మాస్టారు సదా ముందుండేవారు. అలా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంకు చెందిన జెట్టి వీరరాఘవులు, కాస్తా జె.వి.రాఘవులుగా మారి ఘంటసాల వద్ద అనేక సంవత్సరాలు పనిచేశారు. గురువు వద్ద పలు రాగాలను ఔపోసన పట్టి, వాటికి మెరుగులు దిద్దుతూ గాయనీగాయకులతో పాటలు పాడించేవారు రాఘవులు. ఇక రాఘవులు సైతం పలు చిత్రాలలో గాయకునిగా గళం పలికించారు.

ఘంటసాల సంగీతం సమకూర్చిన “లవకుశ, బందిపోటు, భక్తరఘునాథ్, అభిమానం, పెళ్ళిసందడి, పరమానందయ్య శిష్యుల కథ” వంటి చిత్రాలలో పాటలు పాడి ఆకట్టుకున్నారు రాఘవులు. కేవీ మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్ వద్ద కూడా రాఘవులు పనిచేశారు. అయితే గురువు ఘంటసాల వద్ద రాఘవులుకు ఎంతో స్వేచ్ఛ ఉండేది. తనకు నచ్చిన రాగాలలో గురువుగారితో అదే పనిగా పాటలు రూపొందించేలా చేసేవారు. రామానాయుడు నిర్మించిన ‘రాముడు-భీముడు, శ్రీకృష్ణతులాభారం, స్త్రీజన్మ” వంటి చిత్రాలలో కోరస్ లో గొంతు సవరించుకున్న రాఘవులులోని ప్రతిభను గమనించి, రామానాయుడు తాను నిర్మించిన ‘ద్రోహి’ సినిమాతో సంగీత దర్శకునిగా అవకాశం కల్పించారు. ఆ సినిమా ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. తరువాత ‘ప్రేమనగర్’లో కేవీ మహదేవన్ కు అసోసియేట్ గా పనిచేశారు రాఘవులు. అప్పుడు కూడా రాఘవులులో ఏదో ఉందని భావించిన రామానాయుడు, తరువాత తాను నిర్మించిన ‘జీవనతరంగాలు’కు సంగీతం సమకూర్చే బాధ్యత అందించారు. ఈ సారి రాఘవులు తనదైన బాణీ పలికిస్తూ ఆ సినిమాలోని అన్ని పాటలనూ హిట్స్ గా మలిచారు.

“దొరబాబు, ఆడవాళ్ళూ అపనిందలు, ఆత్మీయుడు, భలే అల్లుడు, నా ఇల్లు – నా వాళ్లు, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, కోతలరాయుడు, శివమెత్తిన సత్యం, బెబ్బులి, ఈ నాడు, ఇంట్లో రామయ్య, వీధిలో క్రిష్ణయ్య, సింహపురి సింహం, తరంగిణి, రారాజు, బాబులుగాడి దెబ్బ, దేవాంతకుడు, విశ్వనాథ నాయకుడు, 20 వ శతాబ్దం, ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్ళాం, ధర్మపీఠం దద్దరిల్లింది” వంటి చిత్రాలకు రాఘవులు సమకూర్చిన బాణీలు ఆకట్టుకున్నాయి. రాఘవులు సంగీతాన్ని దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, నిర్మాత వడ్డే రమేశ్ ఎంతగానో ప్రోత్సహించారు. రాఘవులు ఎన్ని సినిమాలకు సంగీతం సమకూర్చినా, ఆయన పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం యన్టీఆర్ ‘బొబ్బిలిపులి’. ఈ చిత్రంలోని “జననీ జన్మభూమిశ్చ…” పాట, “సంభవం ఇది నీకే సంభవం…” గీతం ఆ రోజుల్లో తెలుగునేలను ఓ ఊపు ఊపేశాయి. ఇప్పటికీ జాతీయ పర్వదినాల్లో ఈ పాటలు వినిపిస్తూ ఉంటాయి. 1982లో ‘బొబ్బిలిపులి’ ఆడియో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి, ఓ చరిత్ర సృష్టించింది. చివరి రోజుల్లో రాఘవులును ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, మరికొందరు సినీజనం కలసి ఆదుకున్నారు. రాఘవులు బాణీలు కట్టిన “ఈ జీవన తరంగాలలో… “, “వీణనాది తీగె నీది…”, “అదరహో అదరహా…”, “ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య…”, “తరంగిణీ ఓ తరంగిణీ…”, “అమ్మను మించి దైవమున్నదా…” వంటి పాటలు ఈ నాటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.