Site icon NTV Telugu

రెండు తరాలు కూర్చుని తిన్నా నా ఆస్తి తరగదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోదాడ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 15 ఏళ్లుగా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి అవినీతికి పాల్పడ్డ ఉత్తమ్‌కు నీతి గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. మద్యం సిండికేట్‌లో ప్రతి క్వార్టర్ సీసాపై తనకు కమీషన్ వస్తుందని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కొట్టిపారేశారు. తాను భూములను అమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని.. మరో రెండు తరాలు కూర్చుని తిన్నా తన ఆస్తి తరగదని, తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: కాంగ్రెస్ పార్టీ నేతలకు సోనియా వార్నింగ్

తాను రాజకీయంగా ఎదగడాన్ని కొందరు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేసేవారికి తగిన సమయంలో సమాధానం చెప్తానని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల మెజారిటీతో గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ఉత్తమ్.. ముందు డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఉత్తమ్, ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు మద్యం అమ్ముకున్నారని బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ఇప్పుడు తన హయాంలో కూడా కాంగ్రెస్ నేతలు మద్యం వ్యాపారం చేస్తున్నారని విమర్శలు చేశారు.

Exit mobile version